ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లు పేదల ఆత్మగౌరవ ప్రతీకలు అని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు లింగారెడ్డిపల్లిలో నిర్మించిన 25 డబుల్ బెడ్రూం ఇండ్లను హరీష్‌రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. పేదలు ఆత్మ గౌరవంగా బ్రతికేందుకు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం తెచ్చారని తెలిపారు. లింగారెడ్డిపల్లి గ్రామస్తులు అదృష్టవంతులు.. త్వరలోనే దశ దిశ మారిపోతుందన్నారు. అర్హులైన నిరుపేదలకు మరిన్ని ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. ఇవాళ ఇండ్లు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో ఇండ్ల నిర్మాణం కోసం ఇచ్చే రూ. 40 వేలు బేస్‌మెంట్ వరకు సరిపోయేవి అని తెలిపారు. అప్పుడు ఇండ్లు కడితే అప్పులపాలయ్యే వారు.. చివరకు ప్లాట్లు కూడా అమ్ముకునే వారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులపై ఒక్క రూపాయి కూడా భారం మోపకుండా ఉచితంగా ఇండ్లు నిర్మించి ఇస్తుందన్నారు. ఇండ్ల కోసం ఎవరికైనా లంచం ఇచ్చినా, తీసుకున్నా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.