తమ ప్రేమను పెద్ద లు అంగీకరించరేమోనన్న అనుమానంతో ఒక జంట.. పెండ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో మరో ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడ్డాయి.. విడిపోయి బతుకలేమం టూ కలిసి ప్రాణం విడిచారు. ఈ విషాద ఘటనలు వరంగల్ అర్బన్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో శుక్రవారం వెలుగుచూశాయి.
వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ అర్బన్ జిల్లా ఖిలావరంగల్ మండలం నక్కలపల్లికి చెందిన మన్నెపు కుమారస్వామి, జ్యోతి దంపతుల కుమారుడు సాయి (23), సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్‌కు చెందిన తాటిపాముల అశ్విని(21) ప్రేమించుకున్నారు. ఢిల్లీలో బీటెక్ చదువుకుంటున్న సాయి ఆరు నెలల క్రితం గ్రామానికి వచ్చాడు. తమ ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనని అనుమానించిన వీరు శుక్రవారం నక్కలపల్లి శివారులోని ఓ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
బావి వద్ద బైక్, రెండు జతల చెప్పులు, మొబైల్‌ఫోన్లు, మంగళసూత్రం ఉండటంతో పొలం యజమాని కృష్ణస్వామి మామునూరు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక, డీఆర్‌ఎఫ్ బృందాల సాయంతో మృతదేహాలను వెలికితీశారు.
బైక్ నంబర్ సాయంతో కుమారస్వామి కుమారుడిదిగా గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అశ్విని వద్ద లభించిన పాన్‌కార్డు ఆధారంగా ఆమె కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు. వీరిద్దరికి ఎప్పటినుంచి ఎలా పరిచయమో తమకు తెలియదని అశ్విని, సాయి కుటుంబ సభ్యులు తెలిపారు.