కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ మానవ మృగం.. 21 ఏళ్లుగా ఓ మహిళపై అత్యాచారం చేశాడు. అతనొక్కడే కాదు.. మరో ఇద్దరు స్నేహితులు ఆమెపై విరుచుకుపడ్డారు. చివరగా 9 నెలల క్రితం ఆ మహిళను హత్య చేసి ఖననం చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్‌లో చోటు చేసుకుంది.
21 ఏళ్ల క్రితం ఓ యువతి పోస్టు గ్రాడ్యుయేట్‌ను పూర్తి చేసింది. ఆ యువతి చదివిని కాలేజీలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న క్లర్క్ ఆమెకు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో వారిద్దరూ ఒంటరిగా ఉన్న దృశ్యాలను క్లర్క్ చిత్రీకరించాడు. ఆ దృశ్యాలను ఆసరా చేసుకున్న క్లర్క్.. ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడు.
ఈ క్రమంలో ఆ యువతికి వేరే వ్యక్తితో వివాహమైంది. అయినప్పటికీ క్లర్క్ ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉన్నాడు. చివరకు ఆమె భర్తకు ఆ దృశ్యాలను చూపించడంతో అతను విడాకులిచ్చేశాడు. చేసేదేమీ లేక ఆమె తన పుట్టింట్లోనే ఉండాల్సి వచ్చింది. కొంతకాలం తర్వాత క్లర్క్ మళ్లీ ఆమె వద్దకు వచ్చి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అలా ఒకట్రెండు సంవత్సరాలు కాదు.. ఏకంగా 21 ఏళ్లు ఆమెపై కామంతో చెలరేగిపోయాడు. అతనొక్కడే కాదు.. మరో ఇద్దరు స్నేహితులు కూడా తమ కోరికలను తీర్చుకుని రాక్షస ఆనందం పొందారు. ఇక ఈ ఏడాది మార్చి 12వ తేదీన క్లర్క్‌తో పాటు మరో ఇద్దరు కలిసి ఆమెను హత్య చేసి ఖననం చేశారు. ఆమెపై ఉన్న బంగారు నగలను దొంగిలించారు.
తన బిడ్డను హత్య చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు ఆమె ఫిర్యాదును స్వీకరించలేదు. చివరకు తల్లి కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహిళ హత్యకు గురైన 9 నెలల తర్వాత నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను రమేశ్ సింగ్(క్లర్క్) చంద్రశేఖర్, దిలీప్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు.