శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటం కోసమే తాను క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తానని చెప్పింది కన్నడ సోయగం రష్మిక మందన్న. శరీరం, మనసు రెండింటి మధ్య సమన్వయం కుదిరితేనే ఆనందమయ జీవనం సాధ్యమని..యాభైఏళ్ల వయసొచ్చినా వ్యాయామాన్ని వదిలిపెట్టనని రష్మిక ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేసింది. స్వతహాగా ఫిట్‌నెస్ ప్రేమికురాలైన ఈ కూర్గ్ ముద్దుగుమ్మ సోషల్‌మీడియాలో తరచు ఫిట్‌నెస్ వీడియోల్ని షేర్ చేస్తుంటుంది.
ఆమె మాట్లాడుతూ ‘ప్రతి పనిలో ఉత్తమమైన ప్రతిభ కనబరచాలన్నదే నా లక్ష్యం. అది సాధ్యం కావాలంటే శారీరకంగా కూడా శక్తివంతంగా ఉండాలి. ఎవరి మెప్పుకోలు కోసమో వ్యాయాయం చేయాలనుకోను. ఫిట్‌గా ఉంటేనే రోజువారి వ్యవహారాలు కూడా సౌకర్యవంతంగా అనిపిస్తాయి. కెమెరా ముందు కూడా అందంగా, ఆహ్లాదభరితంగా కనిపిస్తాం. మహిళలు ఎక్కువగా బరువులు ఎత్తకూడదనే అపోహ ఉంది.
ఓ మోస్తరు బరువులు ఎత్తడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గడంతో పాటు ఎముకలు కూడా బలంగా తయారవుతాయి. శరీరఛాయ కూడా మెరుగుపడుతుంది. ఈ మధ్యే వాలీబాల్ ఆడటం నేర్చుకున్నా. ఆ ఆట కూడా ఫిట్‌నెస్‌లో ఓ భాగంగా భావిస్తా’ అని చెప్పింది. ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగులో ‘పుష్ప’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.