డిసెంబరు 13, 2017.. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్‌శర్మ జీవితంలో మర్చిపోలేని రోజు. మొహాలీ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ చెలరేగిపోయాడు. అజేయ డబుల్ సెంచరీ (208)తో కదం తొక్కాడు. ఫలితంగా వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ ఘనతకు నేటితో మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ‘స్టార్‌స్పోర్ట్స్’ ట్వీట్ చేయగా, రోహిత్ బదులిస్తూ.. మరిన్ని సెంచరీలు వస్తాయని బదులిచ్చాడు.
వన్డే క్రికెట్‌లో మొత్తం 8 డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. 2010లో గ్వాలియర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ అజేయ డబుల్ సెంచరీ (200) నమోదు చేశాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అదే తొలి ద్విశతకంగా రికార్డులకెక్కింది. చెన్నైలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ సయీద్ అన్వర్ 194 పరుగులు చేసి ఆరు పరుగుల తేడాతో డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. సచిన్ డబుల్ సెంచరీ సాధించి ఆ రికార్డును బద్దలుగొట్టాడు.
సచిన్ ‘డబుల్’ తర్వాత వన్డేల్లో డబుల్ సెంచరీల మోత మొదలైంది. ఆ తర్వాతి సంవత్సరం సచిన్ ఓపెనింగ్ పార్ట్‌నర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇండోర్‌లో విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 219 పరుగులు చేసి సచిన్ రికార్డును అధిగమించాడు. ఆ తర్వాత నవంబరు 2013లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌శర్మ 209 పరుగులు చేసి తొలి డబుల్ సెంచరీ నమోదు చేశాడు. సరిగ్గా ఏడాది తర్వాత కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకపై 264 పరుగులు చేశాడు. వన్డేల్లో ఇప్పటికీ అదే అత్యధిక స్కోరు.
విదేశీ ఆటగాళ్లలో విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌గేల్ (215), న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ మార్టిన్ గప్టిల్ (237 నాటౌట్), పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ ఫకర్ జమాన్ (210 నాటౌట్) డబుల్ సెంచరీలు చేశారు. అయితే, రోహిత్ శర్మ మాత్రం మూడుసార్లు ఈ ఘనత సాధించి వన్డే క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డును తన పేర లిఖించుకున్నాడు.