దక్షిణాది ఇండస్ట్రీలో పెను సంచలనం సృస్టించింది తమిళ నటి వీజే చిత్ర మరణం. 28 ఏళ్ల ఈ నటి ఉన్నట్లుండి ఆత్మహత్య చేసుకోవడం అందరికీ షాక్. ఆమె అభిమానులు అయితే ఇప్పటికీ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్నమొన్నటి వరకు బుల్లితెరపై కనపించిన ఈమె ఇలా ఉన్నట్లుండి ప్రాణాలు కోల్పోవడం.. అందులోనూ సూసైడ్ చేసుకోవడం తట్టుకోలేకపోతున్నారు. ఈమె మరణించి రెండు రోజులు కావొస్తున్నా ఇప్పటికీ మిస్టరీ మాత్రం వీడడం లేదు. మరోవైపు పోలీసులు మాత్రం ఈమె ఉరి వేసుకోవడం వల్లే చనిపోయిందని క్లారిటీ ఇచ్చారు. ఆత్మహత్య చేసుకుందని.. హత్య అని చెప్పడానికి ఆనవాళ్లు ఏం లేవని చెన్నై పోలీసులు చెప్తున్నారు. కానీ చిత్ర తల్లి విజయ మాత్రం ఈ వాదన అబద్ధం అంటున్నది. పోలీసులు చెప్తున్న దాన్ని తాను నమ్మనని చెప్తుంది విజయ. తన కూతురును కాబోయే అల్లుడు హేమంత్ చంపేసాడని.. ఆమెను హత్య చేసి నాటకాలు ఆడుతున్నాడంటూ ఆమె తీవ్ర ఆరోపణలు చేస్తున్నది.
కాబోయే భర్తతో కలిసి ఉంటుంది చిత్ర. అలాంటిది ఈమె డిసెంబర్ 9 ఉదయం 2.30 నిమిషాలకు చెన్నైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో శవంలా కనిపించింది. ఆ సమయంలో ఆమెతో పాటు హేమంత్ కూడా ఉన్నాడు. అయితే తాను రూమ్ బయట వేచి చూస్తున్నానని.. స్నానం చేసి వస్తానని చిత్ర లోపలే ఉండిపోయిందని పోలీసులకు తెలిపాడు హేమంత్. ఎంత సేపటికి బయటికి రాకపోవడంతో హోటల్ స్టాఫ్‌ను పిలిచి తలుపులు తెరిపించానని చెప్పాడు. అప్పటికే ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు హేమంత్. 28 ఏళ్ల చిత్ర ఆగస్టులో హేమంత్‌తో నిశ్చితార్థం చేసుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోడానికి దరఖాస్తు కూడా చేసుకున్నారు. అంతలోనే ఇలా జరిగిపోయింది.
అయితే, చిత్ర తల్లి విజయ మాత్రం కచ్చితంగా అల్లుడే కూతుర్ని చంపేసాడని చెబుతున్నది. చనిపోవడానికి ముందు రోజు రాత్రి కూడా తాను షూటింగ్‌లో ఉన్నాను.. రావడానికి లేట్ అవుతుందని చెప్పిందని తెలిపింది. అంతలోనే ఉదయం హేమంత్ ఫోన్ చేసి మీ కూతురు చనిపోయిందని చెప్పాడని.. అదెలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తుంది ఈమె. కొన్నాళ్లుగా హేమంత్, చిత్ర కలిసే ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె పాండియన్ స్టోర్స్ సీరియల్‌తో బిజీగా ఉంది. అందులో ముల్లై పాత్రతో చాలా ఫాలోయింగ్ సంపాదించుకుంది. 2013 నుంచి ఇప్పటి వరకు బుల్లితెరపై స్టార్‌గా వెలిగిపోయింది చిత్ర. మొత్తానికి చిత్ర ఆత్మహత్య ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతున్నది.