ఏడేండ్లుగా తన అందం, అభినయంతో తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది ఢిల్లీ భామ రాశీఖన్నా. స్టార్ హీరోలు, యువ హీరోలతో నటిస్తూ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం తమిళ సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెట్టిన ఈ భామ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే ఓ విషయం చెప్పింది. ఇంతకీ ఆ విషయమేంటనుకుంటున్నారా..? రాశీఖన్నా కోలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాలిటిక్స్ గురించి మాట్లాడింది.
‘చిన్నప్పటి నుంచి నాకు ఐఏఎస్ అధికారి కావాలని ఉండేది. కానీ నటిగా మారిపోయా. నా చిన్ననాటి కోరిక తీరదని తెలుసు. కానీ నేను తప్పకుండా రాజకీయాల్లోకి వస్తా. ప్రజల కోసం సేవ చేస్తాను.
అంతకంటే ముందు ఎన్జీవో సంస్థను మొదలు పెడతా. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటా. రాజకీయం ఎలా చేయాలో నాకు తెలియదు. కానీ ప్రజలకు ఎలా సాయం చేయాలో మాత్రం నాకు చాలా బాగా తెలుసునని’ చెప్పుకొచ్చింది. రాశీఖన్నా చెప్పిన మాటలతో భవిష్యత్ లో రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేసేందుకు సిద్దంగా ఉందని తెలుస్తోంది.