కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా భారత్ బంద్ విజయవంతంగా కొనసాగింది. సబ్బండ వర్ణాలు రైతన్నకు అండగా నిలిచారు. యావత్ దేశం ఇవాళ రైతన్నల బంద్‌కు సంపూర్ణ మద్ధతు ప్రకటించింది. రైతు సంఘాలు, రాజకీయ పార్టీల నేతలతో సహా రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. రైతు పొట్టగొట్టే కార్పొరేట్ల కడుపునింపే చట్టాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాలు, రాస్తారోకోలతో రవాణా వ్యవస్థను స్థంభింపజేశారు. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఉద్యోగ, కార్మిక సంఘాలు ధర్నాలో పాల్గొన్నారు.
వాపార వాణిజ్య సముదాయాలు స్వచ్ఛంధంగా మూతబడ్డాయి. ఢిల్లీ, హర్యాణ సరిహద్దులోని సింఘు, టిక్కు ప్రాంతాల్లో రహదారులపై భైఠాయించి శాంతియుతంగా ఆందోళన కొనసాగించారు. దేశంలోని పలు చోట్ల రైళ్లపట్టాలపై నిరసన తెలపడంతో రైళ్లు ఆగిపోయాయి. ఒడిషాలోని భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో రైతు, కార్మిక సంఘాలు రైళ్ల రాకపోకలను ఆడ్డగించారు. గుజరాత్‌లోనూ రైతన్నలు పిలుపునిచ్చిన భారత్ బంద్‌కు భారీ స్పందన వచ్చింది. అన్ని వర్గాల వారు రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలిపారు. రైతు పొట్టగొట్టే చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో భారత్ బంద్ విజయవంతంగా కొనసాగుతున్నది. బీజేపీ పాలిత కర్ణాటకలోనూ బంద్‌కు అనూహ్య స్పందన లభించింది. వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛంధంగా మూసివేశారు. నిరసనకారులు రహదారులను దిగ్బంధించారు.
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్యర్యంలో బంద్ విజయవంతంగా కొనసాగుతున్నది. షాద్‌నగర్ సమీపంలో బూర్గుపల్లి వద్ద మంత్రి కేటీఆర్ బంద్‌లో పాల్గొన్నారు. ఆయన వెంట లక్షలాది మంది రైతులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతలకు నష్టం చేసే కేంద్ర చట్టాలను టీఆర్ఎస్ పార్టీ మొదట్నుంచీ వ్యతిరేకిస్తున్నదని, పార్లమెంటులో కూడా తమ పార్టీ రైతు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం వెనక్కి తగ్గే వరకు టీఆర్ఎస్ పార్టీ ఈ దేశ రైతన్నకు అండగా ఉంటుందని మంత్రి స్ఫష్టం చేశారు.