జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో విజయకేతనం ఎగురవేసిన టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు ఈరోజు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు మరియు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారితో కలిసి గౌరవ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారిని హైదరాబాద్ లోని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు గెలిచిన అభ్యర్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గౌరవ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జిహెచ్ఎంసి ఎన్నికల ఇంఛార్జి భాద్యతలు చేపట్టి ప్రచారం చేయడం జరిగిందని అన్నారు.
అలాగే గౌరవ మంత్రి మల్లారెడ్డి గారు, ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ గారు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు, గౌరవ ఎమ్మెల్యేలు బాజి రెడ్డి గోవర్ధన్ గారు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, హనుమంత్ షిండే గారు, కేపి వివేకానంద్ గారు, డిసిసిబి చైర్మన్ భాస్కర్ రెడ్డి గారు, నాయకులు పోచారం సురేందర్ రెడ్డి గార్ల సమిష్టి కృషితో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అఖండ విజయం సాధించిందని తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఎనిమిది జిహెచ్ఎంసి డివిజన్లలో స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల పర్యవేక్షణలో నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచార కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఎనిమిది డివిజన్ లకు గాను ఏడు డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి తమ అభ్యర్థులను తిరిగి ఆశీర్వదించిన ప్రజలకు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రచారం నిర్వహించిన సమయాల్లో పలు ప్రాంతాల్లో పర్యటించినప్పుడు స్థానిక ప్రజలు వివిధ సమస్యలను తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని, ఆ సమస్యలను పరిగణలోకి తీసుకుని తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి శాశ్వతపరిష్కారం చూపుతామని అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని అన్నారు. గత ఆరేండ్లలో ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పంథాన్ని ఎంచుకుందో అదే తరహాలో రాబోయే రోజుల్లో నగర అభివృద్ధికి మరలా తోడ్పాటునందిస్తామని అన్నారు.