బల్దియా పోరులో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. టీఆర్‌ఎస్-56, బీజేపీ-47, ఎంఐఎం-43, కాంగ్రెస్-2 స్థానాల్లో విజయం సాధించాయి. ఏ పార్టీ మేజిక్ ఫిగర్ సాధించకపోవడంతో హంగ్ పరిస్థితులు ఏర్పడ్డాయి. 56 స్థానాల్లో విజయం సాధించిన టీఆర్‌ఎస్ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఇక 47 స్థానాల్లో విజయం సాధించి బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ తరుణంలో ఏవైనా రెండు పార్టీలు కలిస్తేనే బల్దియా పాలక వర్గం కొలువుదీరుతుంది.
టీఆర్‌ఎస్-బీజేపీ, ఎంఐంఐ-బీజేపీ పొత్తు అసాధ్యం. ఈ పరిస్థితుల్లో టీఆర్‌ఎస్ మేయర్ పీఠాన్ని అధిరోహించాలంటే ఎంఐంఎం మద్దతు తప్పని సరి. అయితే నిన్నటి వరకు తమకు ఎంఐఎంతో ఎలాంటి పొత్తు లేదంటూ ప్రచారం చేసుకున్న టీఆర్‌ఎస్.. ఇప్పుడు ఖచ్చితంగా పతంగి పార్టీ మద్దతు తీసుకోవాల్సిందే. ఇలాంటి తరుణంలో ఎంఐఎం, టీఆర్‌ఎస్‌కు మద్దతిస్తుందా.. లేదా.. ఒకవేళ ఇచ్చినా.. ఎలాంటి షరతులు పెడుతుందనేది ఆసక్తికరంగా మారింది.
ఏకంగా మేయర్ కుర్చీ తమకు ఇవ్వాలని అడిగే ఛాన్స్ ఉందని ప్రచారం. డిప్యూటీ మేయర్‌తో సరిపెట్టుకోవాలని టీఆర్ఎస్ బేరసారాలు సాగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రెండు పార్టీల అధినేతల మధ్య అంగీకారం కుదిరితేనే హంగ్‌తో బల్దియా పాలక వర్గం కొలువుదీరుతుంది. గతంలో 2009లో ఉమ్మడి రాష్ట్రంలో గ్రేటర్‌లో ఇదే పరిస్థితి తలెత్తింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ, ఎంఐంఎంతో కలిసి అధికారంలోకి వచ్చింది. ఈ రెండు పార్టీలు చెరో రెండున్నరేళ్లు మేయర్ పదవిని పంచుకున్నాయి. ప్రస్తుతం టీఆర్ఎస్, ఎంఐఎం కూడా ఇలాంటి అవగాహనకు వస్తాయా.. టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి అధికారం పంచుకుంటాయా.. లేక ఒకరు మేయర్, మరొకరు డిప్యూటీ మేయర్ తీసుకుంటారా అనే అంశాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.