తెలంగాణ భవన్‌లో ఆరేండ్లలో హైదరాబాద్ సాధించిన అభివృద్ధిపై ప్రగతి నివేదిక విడుదల చేసిన మంత్రి కేటీఆర్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీచేసే టీఆర్‌ఎస్ అభ్యర్థులకు గెలుపుపై నిర్దేశంచేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ”ఆర్‌ఎస్ 60 లక్షల మంది గులాబీ సైనికులున్న పార్టీ. అందరికీ అవకాశాలు రావు. అవకాశాలు వచ్చిన వారు తామే గొప్ప అనే భావనతో ఉండకూడదు. వందల కార్యకర్తల్లో ఏ ఒక్కరికో అవకాశం దక్కుతుంది.
అభ్యర్థులుగా అవకాశం వచ్చినవారు.. మీమీ డివిజన్లలో టికెట్ కోసం మీలాగే పోటీపడ్డ ఆశావహుల ఇంటికి ముందుగా పోవాలి. వారి సంపూర్ణ సహకారం కావాలని కోరండి. కడుపుల తలపెట్టండి. పార్టీ అవకాశం నాకిచ్చింది. మీకు భవిష్యత్‌లో మంచిరోజులు వస్తాయి. నేను కూడా సహకరిస్తానని వారికి నచ్చచెప్పి.. వారు మీతో ఎల్లప్పుడు ఉండేవిధంగా బతిమిలాడండి. ఎందుకంటే వందలమంది కష్టపడితేనే ఒక నాయకుడు అవుతాడు.
వేలమంది కార్యకర్తలు కష్టపడితేనే నేను సిరిసిల్లలో ఎమ్మెల్యేను అయ్యాను. ఎదిగినకొద్దీ ఒదిగి ఉండాలని సీఎం కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. టికెట్ వచ్చింది కాబట్టే నేనే గొప్ప అని, విజయగర్వంతో ఊగిపోకుండా మీ డివిజన్‌లోని ఆశావహుల సహకారం తీసుకోండి. అది మీ బాధ్యత. అంతేకాదు సమయంలేదు. ఇంకా పది రోజులే గడువుంది. అభ్యర్థులు అందరూ రేపు ఉదయం బీ-ఫాములు సమర్పించి కార్యక్షేత్రంలో దిగండి. ప్రజల ఆశీర్వాదం తీసుకోండి అని సూచించారు.