జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ స్టార్ క్యాంపెయినర్, పురపాలకశాఖ మంత్రి కే.తారకరామారావు రణభేరి మోగించారు. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. నగరంలోని ఓల్డ్ అల్లాపూర్ చౌరస్తాలో చేపట్టిన రోడ్‌షోలో మంత్రి పాల్గొన్నారు. బోనాలు, బతుకమ్మలతో మహిళలు తరలివచ్చారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, స్థానికులకు మంత్రి అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
నేటి ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ నగరంలోని కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లోని పార్టీ అభ్యర్థులతో కలిసి నాలుగు చోట్ల రోడ్ షో నిర్వహిస్తారు. ప్రస్తుతం కూకట్‌పల్లి నియోజకవర్గం ఓల్డ్ అల్లాపూర్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్‌షోలో కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం మూసాపేట చిత్తారమ్మ తల్లి చౌరస్తా, ఆపై కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలోని ఐడీపీఎల్ చౌరస్తా, సాగర్ హోటల్ జంక్షన్ వద్ద జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
గత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 120 డివిజన్లలో 135 చోట్ల ప్రసంగాలతో గ్రేటర్ హైదరాబాద్‌ను 360 డిగ్రీల కోణంలో కేటీఆర్ చుటివచ్చి 99 చోట్ల జయకేతనం ఎగురవేసి స్వంతంగా మేయర్ స్థానాన్ని దక్కించుకోవడంలో కీలకపాత్ర పోషించారు. ఈసారి గ్రేటర్ పోరులో రోడ్ షోలను విస్తృతంగా చేపట్టి వందకు పైగా స్థానాలను దక్కించుకోవడమే లక్ష్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ సమరశంఖం పూరించారు.