తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆరే భరోసా అని పురపాలకశాఖమంత్రి కే తారకరామారావు అన్నారు. సీఎంగా కేసీఆర్ ఉన్నారనే ధీమాతోనే పెట్టుబడులు వస్తున్నాయని.. ఆయన దార్శనికత వల్లనే హైదరాబాద్ ప్రశాంతంగా ఉన్నదని చెప్పారు.
హైదరాబాద్‌లో విభజన రాజకీయాలు కావాలా.. విశ్వాస రాజకీయాలు కావాలా.. విద్వేషపూరిత రాజకీయాలు కావాలా.. ప్రశాంత ప్రగతి కావాలా తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మంత్రి కేటీఆర్ హైదరాబాద్ ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. సామాజిక న్యాయాన్ని.. టీఆర్‌ఎస్ మాటల్లో కాకుండా చేతల్లో చూపిందన్నారు. అందుకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు సీట్లు ఇవ్వటమే తార్కాణమని పేర్కొన్నారు.
హైదరాబాద్ బాగుంటేనే తెలంగాణ బాగుంటుందని, హైదరాబాద్ ప్రగతిని సాధిస్తేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని చెప్పారు. ప్రజల్ని రెచ్చగొట్టి వారి ప్రశాంత జీవితాన్ని చెదరగొట్టడం ద్వారా పబ్బం గడపాలనిచూసే పార్టీలకు తగిన బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. ఈసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సెంచరీ కొట్టుడు ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.
పెద్ద పెద్ద మాటలు చెప్తున్న బీజేపీ నేతలు దమ్ముంటే కేంద్రంలో ఉన్న తమ పార్టీ ప్రభుత్వం నుంచి హైదరాబాద్ అభివృద్ధికోసం లక్ష కోట్ల ప్యాకేజీ తీసుకొనిరావాలని డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆరేండ్లలో హైదరాబాద్ సాధించిన అభివృద్ధిపై ప్రగతి నివేదిక విడుదలచేశారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీచేసే టీఆర్‌ఎస్ అభ్యర్థులకు గెలుపుపై నిర్దేశంచేశారు.