హైదరాబాద్ నగంరంలోని బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ 12లో నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం మరో రెండు, మూడు నెలల్లో పూర్తి అవుతుందని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ నిర్మాణం పూర్తితో హైదరాబాద్ నగరం మరింత సురక్షితంగా, మరింత భద్రంగా మారనున్నట్లు చెప్పారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనులను మంత్రి కేటీఆర్ నేడు పరిశీలించారు. హోంమంత్రి మహమూద్ అలీ, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మేయర్ బొంతు రామ్మోహన్, డీజీపీ మహేందర్‌రెడ్డి, లా అండ్ ఆర్డర్ ఏడీజీపీ, నగరంలోని మూడు కమిషనరేట్ల సీపీలు, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నిర్మాణ పనుల పరిశీలన అనంతరం మంత్రి కేటీఆర్ మీడియా ద్వారా మాట్లాడుతూ..హైదరాబాద్ మహా నగరాన్ని, మన రాష్ర్టాన్ని అత్యంత సురక్షితమైన, అత్యంత భద్రమైనదిగా తీర్చి దిద్దుతున్నట్లు తెలిపారు. ఒక విజన్‌తో భారత్‌లో ఎక్కడా లేని విధంగా బహుశా అంతర్జాతీయస్థాయిలో సైతం వేళ్ల మీద లెక్కపెట్టేగలిగేలా ఉన్న ఈ అద్భుతమైన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను అందరం కలిసి సందర్శించి ఇక్కడి విషయాలు తెలుసుకోవడం జరిగిందన్నారు. దాదాపుగా 90 శాతం పనులు పూర్తి అయినట్లు తెలిపారు. మరొక రెండు, మూడు నెలల్లో నిర్మాణం పూర్తై అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. అత్యాధునికమైన టెక్నాలజీతో 19 అంతస్తుల్లో చాలా ఆధునికంగా ఈ ఐకానిక్ టవర్ మన ముందకు రాబోతుందన్నారు.
రాజకీయ స్థిరత్వం, శాంతిభద్రతలు రెండూ ముఖ్యమే
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం ఎంత ముఖ్యమో, లా అండ్ ఆర్డర్ కూడా అంతే ముఖ్యమని భావించి సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారన్నారు. ఈ క్రమంలో భాగంగానే మొదట రూ. 800 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని సకల సదుపాయాలు కల్పిస్తూ ఆధునీకరించారన్నారు. అనంతరం రూ. 600 కోట్లతో ఈ ఐకానిక్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణానికి రూపకల్పన చేశారన్నారు. నగరానికి సంబంధించినవే కాకుండా మొత్తం రాష్ర్టానికి సంబంధించిన శాంతి భద్రతల విషయంలో అంటే ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ అన్ని రకాల డిపార్ట్‌మెంట్స్‌కు సంబంధించిన సమాచారాన్ని ఇక్కడి నుంచే మానిటర్ చేసే విధంగా ఈ సెంటర్ నిర్మాణం జరుగుతుందన్నారు.
రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా, వరదలు వచ్చినా, లేదా ఇతర ఏ ప్రకృతి వైపరిత్యం సంభవించినా రాష్ట్ర సీఎంతో పాటు అందరూ కూర్చుని సమన్వయం చేసుకుని ఇక్కడి నుంచి పనిచేసేందుకు ఏర్పాటు చేశారన్నారు. అత్యాధునికమైన డేటా సెంటర్, ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, అత్యున్నతస్థాయిలో ఆపరేషన్స్ ఏర్పాట్లు ఉన్నాయన్నారు. 14వ అంతస్తు వరకు విజిటర్స్‌కు అవకాశం కల్పిస్తూ నగరాన్ని 360 డిగ్రీల కోణంలో చూసేలా ఏర్పాట్లు చేశారన్నారు.