తెలంగాణలో కొరియా పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియా కంపెనీలు ముందుకు రావాలన్నారు. ఈ పార్క్‌లో సకల సౌకర్యాలను కల్పిస్తామని తెలిపారు. భారత్-కొరియా బిజినెస్ ఫోరం బుధవారం ఆన్‌లైన్‌లో నిర్వహించిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఎ్‌సఐపాస్ విధానం అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు గడించిందని గుర్తుచేశారు. గత ఆరేళ్లలో తెలంగాణకు 30 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్నారు. కొరియాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత టెక్స్‌టైల్ కంపెనీ యంగ్వన్ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటు కాబోయే మెడికల్ డివైస్ పార్క్ విస్తరణకు కొరియాలోని గంగ్‌వన్ టెక్‌పార్క్‌తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని చెప్పారు.
హ్యుందయ్ కంపెనీ తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయం తీసుకుందన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే కొరియా కంపెనీలకు రెడ్ కార్పెట్ వేస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే మానవ వనరులకు ప్రభుత్వం తరఫున శిక్షణ ఇచ్చి.. అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
తెలంగాణలో సమర్థ నాయకత్వంతోపాటు పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో పాటు దక్షిణ కొరియా పారిశ్రామిక వర్గాలు, మంత్రులు పాల్గొన్నారు.