ఇటీవలే ఇరవై ఐదో వసంతంలోకి అడుగుపెట్టింది పంజాబీ సొగసరి మెహరీన్. ఈ పుట్టినరోజు తనకు ఎన్నో మధురజ్ఞాపకాల్ని మిగిల్చిందని చెబుతోంది. లాక్‌డౌన్ తర్వాత కుటుంబంతో కలిసి మాల్దీవులకు విహారయాత్రకు వెళ్లిందామె. ఈ ప్రయాణ అనుభవాల్ని మెహరీన్ వెల్లడిస్తూ ‘సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన తర్వాత వ్యక్తిగత జీవితంలోని చాలా సంతోషాల్ని త్యాగం చేయాల్సివచ్చింది.
కుటుంబంతో సరదాగా సమయాన్ని ఆస్వాదించి ఎన్నో ఏళ్లవుతోంది. లాక్‌డౌన్ ముగియగానే టూర్ వెళ్లాలని నిర్ణయించుకున్నా. కోవిడ్ తర్వాత ఏర్పడిన కొత్త సాధారణ జీవితంలోని చాలెంజ్‌లను స్వీకరిస్తూ మాల్దీవులు యాత్రను పరిపూర్ణంగా ఆస్వాదించా. సముద్రతీరాల్ని, సూర్యోదయాలు, సూర్యస్తమయాల్ని చూస్తుంటే సమయమే తెలియలేదు.
గత ఆరేడు నెలలుగా నాలో ఉన్న భయం మొత్తం పోయింది. సైకిల్‌రైడ్స్ నా చిన్ననాటి రోజుల్ని గుర్తుకుతెచ్చాయి. స్కూబాడైవింగ్ సాహసోపేతంగా అనిపించింది. ఈ యాత్రలోనే కుటుంబసభ్యులతో నా పుట్టినరోజు వేడుకల్ని జరుపుకున్నా’ అని తెలిపింది.