తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యమిస్తున్నారని, ఆరేండ్లలో దాదాపు 28వేల మంది పోలీసు సిబ్బంది నియామకాలు చేపట్టారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. రాష్ట్రంలో నేరాలు పూర్తిగా తగ్గాయని.. సాంకేతికత, ఫ్రెండ్లీ పోలీసీంగ్‌తో రాష్ట్ర పోలీసులు సమర్థంగా పనిచేస్తున్నారని అభినందించారు. ప్రజాభద్రత, రక్షణకు ప్రాధాన్యమిస్తున్న సీఎం కేసీఆర్.. పోలీసుశాఖకు అనేక వాహనాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ సెంటర్లో ఏర్పాటుచేసిన బిగ్స్క్రీన్లపై ఒకేసారి 15వేల సీసీ కెమెరాల దృశ్యాలను వీక్షించవచ్చని తెలిపారు. కేంద్రానికి సాంకేతికతను సమన్వయపర్చిన ఎల్అండ్టీ అధికారులు ఇచ్చిన డెమోను మంత్రి కేటీఆర్ తిలకించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందికి సైబర్ నేరాలకు సంబంధించిన అంశాలపై శిక్షణఇచ్చేలా డీజీపీ మహేందర్‌రెడ్డి, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ ఎంవోయూపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, సీపీలు సజ్జనార్, అంజనీకుమార్, మహేశ్‌భగవత్, శాంతి భద్రతల అదనపు డీజీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు.
