మధ్యప్రదేశ్‌లోని 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు చురుకుగా జరుగుతోంది. మధ్యాహ్నం 11.00 గంటల వరకూ జరిగిన లెక్కింపులో బీజేపీ 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 9 స్థానాల్లో ఆధిక్యం కొనసాగిస్తోంది.
బీఎస్‌పీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. మధ్యప్రదేశ్ రాజకీయాలను మలుపు తిప్పిన జ్యోతిరాదిత్య ప్రభావం ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించిందా అనే దానిపై పూర్తి ఫలితాలు వెల్లడైన తర్వాతే స్పష్టత వస్తుంది.
బీజేపీ అధికారం నిలుపుకోవాలంటే 28 స్థానాల్లో కనీసం 8 స్థానాలు గెలుచుకోవాల్సి ఉంటుంది. ఏడు నెలల క్రితం జ్యోతిరాదిత్య సింధియా, పలువులు కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు చేసి బీజేపీలో చేరడంతో అధికారం కోల్పోయిన రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కూడా ఎన్నికల ఫలితాలు కీలకం కానున్నాయి.
కోవిడ్ ప్రభావం ఉన్నప్పటికీ ఈ ఉప ఎన్నికల్లో 70.27 శాతం పోలింగ్ నమోదైంది. 12 మంది మంత్రులు సహా 355 మంది అభ్యర్థుల భవితవ్యం సాయంత్రానికల్లా తేలనుంది.