కరోనా, లాక్‌డౌన్ ప్రభావం వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ర్టానికి వచ్చే ఆదాయం రూ.52,750 కోట్ల మేర తగ్గనున్నదని ఆర్థికశాఖ అధికారులు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు వెల్లడించారు. రాష్ర్టానికి పన్నులు, పన్నేతర మార్గాల ద్వారా 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-అక్టోబర్ మధ్య ఏడు నెలల్లో రూ.39,608 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.
ఈ ఏడాది అక్టోబర్ వరకు రూ.33,704 కోట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్‌లో ఆర్థికశాఖ అధికారులతో సమావేశమయ్యారు. 2020-21 బడ్జెట్‌పై మధ్యంతర సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటును 15 శాతంగా అంచనా వేసి 2020-21 బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించామని, అయి తే కరోనా వల్ల 15% వృద్ధి కనిపించకపోగా, గతేడాది వచ్చినంత ఆదాయం కూడా రాలేదని తెలిపారు.
ఈ ఏడాది రాష్ర్టానికి పన్నులు, పన్నేతర మార్గాల ద్వారా మొత్తం రూ.1,15,900 కోట్ల ఆదాయం వస్తుందనే అంచనాతో బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందాయని పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది రూ.68,781 కోట్లు మాత్రమే సమకూరే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దీంతో స్వీయ ఆదాయం రూ.47,119 కోట్లు తగ్గనున్నదని చెప్పారు.
Post Views: 211