ఒకప్పుడు భాగ్యనగరంలో డబుల్ డెక్కర్ బస్సులు పరుగెడుతుంటే చూడముచ్చటగా ఉండేది. నిజాం కాలంలో ప్రారంభమైన డబుల్ డెక్కర్ బస్సులు కాలక్రమేణా కనుమరుగై పోయాయి.
అయితే షాకీర్ హుస్సేన్ అనే యువకుడు డబుల్ డెక్కర్ బస్సులను గుర్తు చేస్తూ ఐటీ మినిస్టర్ కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఒకప్పుడు డబుల్ డెక్కర్ బస్సు సికింద్రాబాద్ నుంచి జూపార్క్ మార్గంలో 7 నంబర్‌తో నడిచేవి. జూపార్క్ నుంచి హైకోర్టు, అఫ్జల్‌గంజ్, అబిడ్స్, హుస్సేన్ సాగర్, రాణిగంజ్ మీదుగా సికింద్రాబాద్‌కు చేరుకునేవి డబుల్ డెక్కర్ బస్సులు. హైదరాబాద్‌లో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులను ప్రయాణికులు లేదా టూరిస్టుల కోసం తీసుకురావాలని షాకీర్ హుస్సేన్ కేటీఆర్‌ను కోరారు.
ఈ ట్వీట్‌పై కేటీఆర్ స్పందించారు. అబిడ్స్‌లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో తాను చదువుకున్నప్పుడు.. దారిగుండా వెళ్తున్నప్పుడు డబుల్ డెక్కర్ బస్సులు కనిపించేవి. డబుల్ డెక్కర్ బస్సుల గురించి చాలా జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఆ బస్సులను ఎందుకు ఆపేశారో తనకు కచ్చితంగా తెలియదన్నారు. డబుల్ డెక్కర్ బస్సులను మళ్లీ రోడ్లపైకి తీసుకువచ్చేందుకు ఏమైనా అవకాశం ఉందా? అంటూ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ను కేటీఆర్ అడిగారు.