ఇటీవలే సీనియర్ కథానాయిక కాజల్ అగర్వాల్ పళ్లైయిపోయింది. తమ ఆరాధ్య నాయిక బ్యాచిలర్ డిగ్రీకి గుడ్‌బై చెప్పడంతో అభిమానులు కాస్త కలవరపాటుకు గురై నిరాశల నిట్టూర్పులు విడిచారు. చివరకు ‘ఎప్పటికైనా జరగాల్సిన ముచ్చటే’ కదా అంటూ సర్దిచెప్పుకొని సంతోషపడ్డారు. ఈ అమ్మడి వివాహంతో ఇప్పుడు తెలుగు చిత్రసీమలో మూడుపదులు దాటిన ముద్దుగుమ్మల పెళ్లి గురించి చర్చ మొదలైంది. దాదాపు దశాబ్దకాలంపైగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న సదరు నాయికలు పెళ్లిపీటలెక్కితే చూసి ముచ్చటపడదామని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే పెళ్లి ముచ్చట గురించి కథానాయికలు మాత్రం పెదవి విప్పడం లేదు. వృత్తిపరంగా అద్భుత విజయాల్ని సొంతం చేసుకున్న ఈ థర్టీప్లస్ భామలు పెళ్లి విషయంలో మాత్రం ఆలస్యం ఎందుకు చేస్తున్నారో అంటూ అభిమానులు ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నారు.
గత పదిహేనేళ్లుగా వన్నె తరగని అందంతో దక్షిణాది ప్రేక్షకుల్ని అలరిస్తోంది మలయాళీ మలయమారుతం నయనతార. ఇప్పటికీ ఈ భామకు యువతరంలో మంచి ఫాలోయింగ్ ఉంది. గత కొన్నేళ్లుగా ఈ అమ్మడి పెళ్లి తాలూకు వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తమిళ దర్శకుడు విఘ్నేష్‌శివన్‌తో నయనతార ఐదేళ్లుగా నిర్విఘ్నంగా ప్రేమాయణం సాగిస్తోంది. ఈ జంట చెట్టపట్టాల్, ముద్దుమురిపాలు సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. అయితే తమ ప్రేమాయణం గురించి ఈ జోడీ ఎప్పుడూ బహిరంగంగా స్పందించకపోవడం విశేషం. కొన్నినెలల క్రితం ఓ అవార్డును స్వీకరించిన నయనతార ‘నాకు కాబోయే భర్త తోడ్పాటుతోనే కెరీర్‌లో విజయాలు సాధించగలుగుతున్నా’ అంటూ అన్యాపదేశంగా విఘ్నేష్‌శివన్ గురించి చెప్పింది.
‘మా పెళ్లికి ఇప్పుడేం తొందరలేదు. మేం వృత్తిపరంగా సాధించాల్సిన విజయాలు మిగిలే ఉన్నాయి’ అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విఘ్నేష్ శివన్ చెప్పడంతో ఈ జంట పెళ్లికి ఇంకా చాలా సమమం పడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రేమికుల జోడీ చెన్నైలో ఒకే ఫ్లాట్‌లో ఉంటూ సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం నయనతార అరడజనుకుపైగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
పాలసంద్రంలోంచి నడచి వచ్చిన దేవకన్యలా ఉంటుంది తమన్నా అంటూ ఆమె అభిమానులు మురిసిపోతుంటారు. ప్రతి సందర్భంలో ఈ పంజాబీ సుందరిని ‘మిల్క్‌బ్యూటీ’ అంటూ అభివర్ణిస్తుంటారు. చిత్రసీమలో ఈ సొగసరి దశాబ్దన్నర ప్రయాణాన్ని పూర్తిచేసుకుంది. రెండేళ్ల క్రితం తమన్నా పెళ్లి గురించిన వార్తలు వినిపించాయి. అమెరికాకు చెందిన ఓ వైద్యుడిని ఆమె పెళ్లాడబోతుందని ప్రచారం జరిగింది. వీటిని ఖండించిన తమన్నా తాను సింగిల్‌గా ఉన్నానని స్పష్టం చేసింది.
‘ప్రస్తుతం నేను సినిమాలతో ప్రేమలో ఉన్నా. పెళ్లి మూమూలు విషయం కాదు. ఒకవేళ పెళ్లి కుదిరితే ఆ విషయాన్ని నేనే స్వయంగా వెల్లడిస్తా’ అని చెప్పింది. ప్రస్తుతం తమన్నా తెలుగులో ‘సీటీమార్’ ‘గుర్తుందా శీతాకాలం’ ‘అంధాదున్’ రీమేక్ చిత్రాల్లో నటిస్తోంది.
దక్షిణాది సినీరంగంలో దాదాపు ఇరవైఏళ్లుగా కథానాయికగా సత్తాచాటుతోంది తమిళ సోయగం త్రిష. కెరీర్ తొలినాళ్లలో యువతరం ఆరాధ్య నాయికగా పేరు సంపాదించుకుంది. చెన్నైకి చెందిన వ్యాపారవేత్త వరుణ్‌మణియన్‌తో మూడేళ్ల క్రితం త్రిష నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అనంతరం వ్యక్తిగత కారణాలతో ఈ జంట నిశ్చితార్థాన్ని రద్దుచేసుకున్నారు. త్రిష సినిమాల్లో నటించడం వరుణ్‌మణియన్‌కు ఇష్టం లేకపోవడం వల్లే ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయిందనే వార్తలు వినిపించాయి. మూడేళ్ల విరామం తర్వాత ఇటీవలే త్రిష ప్రేమ, పెళ్లికి సంబంధించిన వార్తలు తమిళ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కథానాయకుడు శింబుతో ఈ సుందరి ప్రేమలో ఉందని వినిపిస్తోంది. వీరిద్దరు కలిసి గతంలో అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు. లాక్‌డౌన్ సమయంలో గౌతమ్‌మీనన్ దర్శకత్వంతో రూపొందించిన లఘు చిత్రం ‘కార్తిక్ డయల్ సేత యెన్’లో శింబు, త్రిష కలిసి నటించారు.
దాంతో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని చెబుతున్నారు. అయితే పెళ్లి వార్తల్ని త్రిష ఖండించింది. శింబు తనకు గొప్ప స్నేహితుడని.. ఆ బంధం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని తెలిపింది. దాంతో త్రిష పెళ్లి వార్తలకు ఫుల్‌స్టాప్ పడ్డట్లయింది.
తెలుగు పరిశ్రమలో గత పదిహేనేళ్లుగా తిరుగులేని స్టార్‌డమ్‌తో కొనసాగుతోంది కన్నడ సుందరి అనుష్క. ‘సూపర్’తో మొదలైన ఆమె ప్రయాణం నిర్విఘ్నంగా సాగుతోంది. గత రెండేళ్లుగా అనుష్క పెళ్లి గురించిన పుకార్లు వినిపించాయి. తెలుగులో ఓ అగ్ర కథానాయకుడితో ఆమె ప్రేమలో ఉందనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ వార్తలు పూర్తి నిరాధారమంటూ ఆగ్రహం వ్యక్తం చేసిందామె. ఆ తర్వాత బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్తతో అనుష్క పెళ్లంటూ కథనాలు వినిపించాయి. ఇవన్నీ ఒట్టి పుకార్లు అంటూ కొట్టిపారేసిన అనుష్క తనకు వివాహ వ్యవస్థపై గొప్ప గౌరవముందని తెలిపింది. ‘నా పెళ్లి గురించి ఇతరులకు ఇంత ఆసక్తి ఎందుకో అర్థం కాదు. ప్రేమలో ఉంటే ఆ బంధాన్ని ఎవరూ దాచలేదు. అలాగే రహస్యంగా ఎవరూ పెళ్లిచేసుకోరు. ప్రేమ, పెళ్లి గురించిన అంశాలపై ఎవరైనా సరే ఆచితూచి మాట్లాడాలి’ అంటూ సున్నితంగా హెచ్చరించింది. ఏదిఏమైనా ఈ జేజమ్మ పెళ్లి కబురు ఎప్పుడు వింటామా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తండ్రి కమల్‌హాసన్ ఘనమైన సినీ వారసత్వంతో చిత్రసీమలోకి అడుగుపెట్టింది శృతిహాసన్.
దక్షిణాదిన అగ్ర కథానాయికల్లో ఒకరైన ఈ సుందరి కొన్నేళ్లపాటు ఇటాలియన్ థియేటర్ ఆర్టిస్టు మైకేల్ కోర్సెల్‌తో ప్రేమాయణాన్ని సాగించింది. రెండేళ్ల క్రితం ఈ జంట కలిసి చెన్నైలో పలు ప్రైవేట్ ఫంక్షన్స్‌లో పాల్గొని సందడి చేశారు. దీంతో వీరిద్దరి వివాహం ఖాయమని అభిమానులు నిర్ధారణకు వచ్చారు. అయితే ఏడాది క్రితం ఈ జంట తమ బంధానికి వీడ్కోలు చెప్పారు.ప్రస్తుతం శృతిహాసన్ సింగిల్‌గానే ఉంటోంది. దాదాపు 35వ పడిలోకి ప్రవేశించిన ఈ భామ పెళ్లిపై దృష్టిపెడితే బాగుంటుందని కుటుంబ సభ్యుల సూచిస్తున్నారట.
ఇక తెలుగు, తమిళంలో విజయవంతమైన చిత్రాల్లో నటించిన అచ్చ తెలుగందం అంజలి పెళ్లిపై కూడా గత ఏడాది కొన్ని వార్తలొచ్చాయి. తమిళనటుడు జైతో ఈ భామ ప్రేమాయణాన్ని సాగిస్తోందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ తమిళ మీడియాలో కథనాలు ప్రసారం అయ్యాయి. అవన్నీ అబద్ధమని తేల్చిచెప్పింది అంజలి. ప్రస్తుతం ఈ సుందరి తెలుగులో ‘వకీల్‌సాబ్’ చిత్రంలో నటిస్తోంది.