తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ నూతన విప్లవాన్ని సృష్టిస్తున్నది. భూక్రయవిక్రయాలు.. సమస్యలతో రైతన్న ఎక్కడా.. ఎలాంటి ఇబ్బందికీ లోనుకాకూడదనే సీఎం కేసీఆర్ సంకల్పాన్ని సాకారంచేస్తున్నది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దన్నుతో సమస్త సమాచారం అందుబాటులోకి వచ్చింది.
కనీస పరిజ్ఞానముంటే ఇంటినుంచే భూక్రయవిక్రయాలను నిర్వహించుకొనే సౌలభ్యాన్ని కల్పించింది. సాధారణంగా ఎవరైనా సరే భూమి కొనుగోలుకు ముందుగా అది వివాదాల్లో ఉందా? లేదా? ఏమైనా కేసులున్నాయా? లేవా? వారి వారసులు ఎవరు? భవిష్యత్‌లో ఏమైనా సమస్యలు సృష్టిస్తారా? తదితర అంశాలను ఎంక్వయిరీ చేస్తారు. ఇందుకోసం తొలుత సదరు భూమికి సంబంధించిన ఎన్‌కంబరెన్స్ సర్టిఫకెట్‌ను (ఈసీ)ని తీసుకొంటారు. అందుకోసం కొంత మొత్తాన్ని చలానాగా చెల్లించాల్సి ఉంటుంది.
అదీ వెంటనే ఇస్తారా అంటే కాదు. రెండు మూడ్రోజుల సమయం తీసుకొనేవారు. ధరణి పోర్టల్ ఆ తిప్పలకు తెరదించింది. భూమికి సంబంధించిన సమస్త సమాచారం అందులో లభిస్తుంది. పోర్టల్‌లో లాగిన్ అవగానే డ్యాష్‌బోర్డులో ఈసీకి సంబంధించి కాలమ్‌పై క్లిక్ చేస్తే చాలు.. ఏ జిల్లా.. ఏ మండలం.. ఏ రెవెన్యూ గ్రామంలో ఉందో ఎంచుకొని సర్వే నంబర్‌ను ఎంటర్‌చేస్తే చాలు క్షణాల్లో ఆ భూమి గత చరిత్ర.. లావాదేవీలన్నీ ప్రత్యక్షమవుతాయి.
ఒకవేళ ఆ భూమి వివాదాల్లో ఉంటే ఆ వివరాలు పోర్టల్‌లో ప్రత్యక్షం కావు. దీంతో కొనుగోలుదారు జాగ్రత్త పడే అవకాశముంటుంది. ‘కొత్త విధానం వల్ల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ ఎంతో త్వరగా, సమర్థంగా పారదర్శకతతో అద్భుతమైన సేవలు అందాయి. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ఈ పాస్‌బుక్ ప్రక్రియ అంతా 30 నిమిషాల సమయం పట్టింది. ఈ విధానంలో మా తల్లిదండ్రులు చాలా సంతృప్తి చెందారు’ అని మేడ్చల్‌కు చెందిన ప్రియాంక పేర్కొన్నారు.