గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో డివిజన్లకు పోటీ చేసే అభ్యర్థులు గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు ఎన్నికల ఖర్చు చేయవచ్చునని, ఈ పరిమితిని మించరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సి.పార్థసారథి తెలిపారు. పాలక మండలి గడువు ముగిసే ఫిబ్రవరి 10వ తేదీ లోగానే ఎన్నికలు పూర్తి చేయాలన్నారు. ఈసీ కార్యాలయంలో గురువారం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తోపాటు నగరం పరిధిలోకి వచ్చే జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో ఆయన సమావేశమయ్యారు.
వార్డులవారీగా ఓటరు ముసాయిదా జాబితాను శుక్రవారం ప్రచురించడంతోపాటు 13న తుది జాబితాను ప్రకటించాలన్నారు. నోటిఫికేషన్ వెలువడే వరకు కొత్తగా ఓటర్లు నమోదు కావచ్చన్నారు.
కరోనా జాగ్రత్తలు పాటించాలని, పోలింగ్ కేంద్రాలకు విశాలమైన గదులు గుర్తించాలని, ఒక్కో కేంద్రంలో 1000 మంది ఓటర్లకు మించకుండా చూడాలని, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పోలీసు, రెవెన్యూ అధికారులతో సంప్రదించి గుర్తించాలని, బందోబస్తు ప్రణాళికలను రూపొందించుకోవాలని సూచించారు. 2016నాటి రిజర్వేషన్లే అమలవుతాయని స్పష్టం చేశారు