తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే. ఈ క్రమంలో హైదరాబాద్‌ను అద్భుతంగా తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే దుర్గం చెరువును సుందరంగా తీర్చిదిద్దారు. అక్కడ నిర్మించిన కేబుల్ బ్రిడ్జి నగరానికి మణిహారంలా మారింది. ఇప్పుడు అలాంటి మరో స్టీల్ వంతెనను నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
మెహిదీపట్నం వద్ద పాదాచారుల కోసం స్కై వాక్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ స్కై వాక్ నిర్మాణానికి రాష్ర్ట ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఆమోదం తెలిపినట్లు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ట్వీట్ చేశారు.
త్వరలోనే ఈ నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా అక్కడున్న బస్ షెల్టర్స్ ను కూడా రీడిజైన్ చేయనున్నారు. పాదాచారుల స్కైవాక్ 500 మీటర్ల పొడవున స్టీల్‌తో నిర్మించనున్నారు. మొత్తం 16 లిఫ్ట్‌లను ఏర్పాటు చేయనున్నారు. రైతు బజార్‌లో రెండు లిఫ్ట్‌లను ఏర్పాటు చేయనున్నారు.