దుబ్బాక ఉప ఎన్నికల్లో డబ్బుతో బీజేపీ ఓటర్లను ప్రలోభ పెట్టే కుట్రను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు భగ్నంచేశారు. విశాఖ ఇండస్ట్రీస్ సంస్థ నుంచి ఇన్నోవా కారులో కోటి రూపాయలు తీసుకొని దుబ్బాకకు వెళ్తున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బావమరిది సురభి శ్రీనివాస్‌రావును నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఆదివారం విలేకరులకు వెల్లడించారు. సిద్దిపేటకు చెందిన సురభి శ్రీనివాసరావు చందానగర్‌లో ఉంటూ పదేండ్లుగా ఎ టూ జెడ్ సొల్యూషన్ లిమిటెడ్ పేరుతో పటాన్‌చెరులో మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడని తెలిపారు.
ఈయన దుబ్బాక బీజీపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు స్వయనా బావమరిద అని పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం.. శ్రీనివాస్‌రావు (టీఎస్09 ఈఎఫ్ 6909 ) ఇన్నోవా కారులో చందానగర్‌కు చెందిన కారు డ్రైవర్ టీ రవికుమార్‌తో కలిసి దుబ్బాక ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేయాల్సిన డబ్బు కోసం బేగంపేటలో విశాఖ ఇండస్ట్రీస్ కార్యాలయానికి వెళ్లాడని వివరించారు. ఈ కార్యాలయం పెద్దపల్లి మాజీ ఎంపీ జీ వివేక్ వెంకటస్వామిదని అన్నారు. విశాఖ ఇండస్ట్రీస్ మేనేజర్ నుంచి కోటి రూపాయలు తీసుకొని ఆ కారులో తిరిగి బయలుదేరారని తెలిపారు.
విశ్వసనీయ సమాచారం మేరకు నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కే నాగేశ్వర్‌రావు బృందం బేగంపేట్ పోలీసుల సహకారంతో.. డబ్బుతో వెళ్తున్న శ్రీనివాస్‌రావు కారును ఆపి తనీఖి చేసిందని చెప్పారు. అందులో 2 వేలు, 500 నోట్ల కట్టలు.. కోటి రూపాయలు బయటపడ్డాయి. ఎక్కడి నుంచి తెస్తున్నారని శ్రీనివాస్‌రావును పోలీసులు విచారించడంతో దుబ్బాక ఎన్నికలకు పంపేందుకు.. విశాఖ ఇండస్ట్రీస్ నుంచి తీసికెళ్తున్నట్టు చెప్పినట్టు తెలిపారు. దీంతో డబ్బు, కారు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని శ్రీనివాస్‌రావుతో పాటు డ్రైవర్‌ను అరెస్ట్ చేసి తదుపరి విచారణ నిమిత్తం బేగంపేట పోలీసులకు అప్పగించినట్టు సీపీ వెల్లడించారు.