బీజేపీ నేతలు చెప్పేవన్నీ అబద్ధాలేనని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో కేంద్రం నిధులున్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఏది నిజమో.. ఏది అబద్ధమో దుబ్బాక ప్రజలు ఆలోచించాలని, తప్పుడు ప్రచారాలని నమ్మి మోసపోతే గోస పడతామని అన్నారు. శుక్రవారం సిద్దిపేటలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రజలు, మేధావులకు నిజాలు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే బీజేపీ నేతల అబద్ధాలపై పలుమార్లు సవాళ్లు విసిరినా తోకముడిచారే తప్ప ముందుకు రాలేదని విమర్శించారు. బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ అని, ఆ పార్టీ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నదని ధ్వజమెత్తారు. 11 అంశాలపై బీజేపీ జూటా ప్రచారం చేస్తున్నదని ఆయన దుయ్యబట్టారు.
ఝూటా మాటలకు నిజాలు ఇవే
టీఆర్‌ఎస్ ప్రభుత్వం బీడీ కార్మికులకు ఇచ్చే రూ.2016 పింఛన్‌లో రూ.1600 కేంద్రం ఇస్తున్నదని ప్రచారం చేస్తున్నారని, కానీ ఒక్క రూపాయి కూడా దాని వాటా లేదన్నారు. పైగా 18ు జీఎస్టీ విధించడంతో బీడీల అమ్మకాలు పడిపోయి కార్మికులకు పని దొరకడం కరువైందని చెప్పారు. కేసీఆర్ కిట్ పథకంలో రూ.13 వేలు రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తున్నదని, కానీ ఇందులో రూ.8వేలు తమవేనంటూ బీజేపీ చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. గొల్లకుర్మలకు గొర్రెల పంపిణీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.93,750 ఇస్తుండగా లబ్ధిదారులు రూ.31250 వాటా కలుపుతున్నారే తప్ప ఇందులో కేంద్రానికి సంబంధం లేదన్నారు.
కానీ రూ.50 వేలు తామే ఇస్తున్నట్లుగా డబ్బా కొడుతున్నారని ధ్వజమెత్తారు. చేగుంటకు రూ.25 కోట్లతో ఈఎ్‌సఐ ఆస్పత్రి మంజూరైతే.. దానిని గజ్వేల్‌కు తీసుకెళ్లారని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని.. గజ్వేల్‌లో ఈఎ్‌సఐ ఆస్పత్రి ఎక్కడుందో చూపించాలని సవాల్ విసిరారు. చివరకు పేదలు తినే రేషన్ బియ్యం మీద కూడా బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దుబ్బాకకు పాలిటెక్నిక్ కాలేజీ మంజూరై శంకుస్థాపన చేశాక సిద్దిపేటకు తరలించారంటున్నారని, దాంట్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఎక్కడ శంకుస్థాపన చేశారో ఇంతకు మంజూరైన పత్రమేదో చూపించాలన్నారు. బాయిలకాడ మోటార్లకు బీజేపీ వాళ్లే మీటర్లు పెడుతూ కేసీఆర్ పెడుతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కొనేందుకు కేంద్రమే రూ.5,500 కోట్లు విడుదల చేసిందని చెప్పడం పూర్తిగా అవాస్తవమని, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు. వెయ్యి అబద్ధాలాడైనా ఓ పెళ్లి చేయాలనే సామెతను స్ఫూర్తిగా తీసుకొని.. వెయ్యి అబద్ధాలాడైనా ఓ ఎన్నిక గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. గల్లీ నేత నుంచి కేంద్ర మంత్రి దాకా అసత్యమేవ జయతే అంటూ అడ్డగోలుగా అబద్ధాలు ఆడుతున్నారన్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ఎంపీలు ఈ రెండేళ్లలో ఏమి అభివృద్ధి చేశారో శ్వేతపత్రాలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.