ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ మెట్రో రైళ్ల రాకపోకల సమయాన్ని అధికారులు పొడిగించారు. దీంతో నేటి నుంచి రాత్రి 9.30 గంటల వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి.
ఇప్పటివరకు విరామాలతో రాత్రి తొమ్మిది గంటల వరకు రైళ్లను నడిపారు. అయితే రద్దీ పెరగడంతో రైళ్ల సమయాలను మరో అరగంట పాటు పొడిగించారు. ప్రతి మూడు నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుందని అధికారులు వెల్లడించారు.
కరోనా నేపథ్యంలో మార్చి 22 నుంచి నిలిచిపోయిన సేవలను సెప్టెంబర్ 7న మళ్లీ ప్రారంభించారు. అప్పటి నుంచి దశల వారీగా మూడు కారిడార్‌లలో మెట్రో రైళ్లను నడుపుతున్నారు. క్రమంగా మెట్రో రైళ్లకు ప్రయాణికుల నుంచి ఆదరణ పెరుగుతుండడంతో రైళ్ల రాకపోకల సమయాలను పొడిగించారు.