విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన చిత్రం ‘ఎఫ్ 2’కు జాతీయ అవార్డు లభించింది. 2019 ఇండియన్ పనోరమ విభాగంలో ఈ చిత్రానికి ఈ అవార్డు దక్కింది. వెంకటేశ్, వరుణ్‌తేజ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన మల్టీస్టారర్ ‘ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ (‘ఎఫ్ 2’) చిత్రం గతేడాది సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. దర్శకుడు అనిల్ రావిపూడి ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు.
‘‘బాక్సాఫీసు నుంచి బ్లాక్ బ్లస్టర్ దాకా సాగిన ప్రస్థానానికి జాతీయ గుర్తింపు లభించింది. వెంకటేశ్ గారికి, నా సోదరుడు వరుణ్‌తేజ్ , ఇతర నటీనటులు, షూటింగులో సహకరించిన సిబ్బందికి నా ధన్యవాదాలు’’ అని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘ఎఫ్ 2’కు జాతీయ అవార్డు రావడంపై వెంకటేశ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘‘ఈ వార్త చాలా ఆనందం కలిగించింది.
నా పైన నమ్మకం ఉంచి ఈ ప్రాజెక్ట్‌లో నన్ను కూడా భాగం చేసిన అనిల్ రావిపూడికి నా ధన్యవాదాలు. ఇందులో నేను కూడా పాలు పంచుకున్నందుకు గర్వపడుతున్నాను. ఈ ప్రయాణంలో నన్ను కూడా భాగస్వామిని చేసిన చిత్ర బృందానికి ధన్యవాదాలు’’ అని ఆయన ట్వీట్ చేశారు. ‘ఎఫ్ 2’ చిత్రానికి సీక్వెల్ రెడీ అవుతోంది.