అబూధాబీ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అదరగొట్టింది. చెన్నై ఇచ్చిన 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 15 బంతులు ఉండగానే చేధించి మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ప్లేఆఫ్ బరిలో నిలిచేందుకు రెండు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం కావడంతో ఇరు జట్ల మధ్య పోరు రసవత్తరంగా ఉంటుందని ప్రేక్షకులు భావించారు. కానీ.. టాస్ గెలిసి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై జట్టు పేలవంగా ఆడింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేసి ప్రత్యర్థి ఎదుట స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. చెన్నై బ్యాట్స్‌మన్‌లలో ఒక్కరంటే ఒక్కరు కూడా బ్యాట్ ఝళిపించలేకపోయారు.
వంద పరుగులు రాబట్టడానికి 17 ఓవర్లు అవసరమయ్యాయంటే చెన్నై ఎంత ఘోరంగా ఆడిందో అర్థం చేసుకోవచ్చు. జట్టులో జడేజా చేసిన 35 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. అవి కూడా 30 బంతుల్లో 4 ఫోర్లతో సాధించాడు. శామ్ కరన్ 22, డుప్లెసిస్ 10, వాట్సన్ 8, రాయుడు 13, ధోనీ 28 పరుగులు చేశారు. ఇక రాజస్థాన్ నుంచి బ్యాటింగ్‌కు దిగిన బట్లర్ పరుగుల వరద సృష్టించాడు. 48 బంతుల్లో 70 పరుగులు చేసి మ్యాచ్‌ను విజయపథం వైపు నడిపాడు. మొత్తంగా 17.3 ఓవర్లలో రాజస్థాన్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసి చెన్నైపై ఘన విజయం సాధించింది.