తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి, తెలుగుదేశం శాసనసభాపక్షం ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షునిగా ఎల్.రమణను కొనసాగించారు. పార్టీలో కీలకమైన సంస్థాగత పదవులను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సోమవారం ప్రకటించారు. చాలా రోజుల క్రితమే ఈ కసరత్తును పూర్తి చేసినా మంచి రోజులు లేవనే కారణంతో ఆపారు.
ఆదివారం నుంచి ఆ అడ్డంకి తొలగడంతో సోమవారం ప్రకటించారు. అచ్చెన్నాయుడి నియామకాన్ని ఆ పార్టీ వర్గాలు చాలా కాలం నుంచే ఊహిస్తున్నాయి. ప్రభుత్వం నమోదు చేసిన కేసుతో కొంత కాలం జైలులో ఉండాల్సి రావడంతో పార్టీ వర్గాల్లో అచ్చెన్నాయుడి పట్ల మొగ్గు మరింత పెరిగింది. ఇప్పటిదాకా రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా ఉన్న కిమిడి కళావెంకట్రావును పొలిట్‌బ్యూరోలోకి తీసుకొన్నారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
మరో కేసులో జైలుపాలై సానుభూతి పొందిన కొల్లు రవీంద్రకు పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పదోన్నతి లభించింది. ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఈసారి పొలిట్‌బ్యూరోలో సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు చోటు దక్కింది. ఇంతకు ముందు ఆయన అన్న హరికృష్ణ ఉండేవారు. చంద్రబాబు తనయుడు లోకేశ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తిరిగి నియమితులయ్యారు. సుదీర్ఘ కాలంగా పార్టీ కేంద్ర కార్యాలయ కార్యదర్శిగా పనిచేస్తున్న టీడీ జనార్దనరావు ఈసారి పార్టీ రాజకీయ కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు)గా నియమితులయ్యారు. పార్టీలో రాజకీయ కార్యదర్శి నియామకం ఇదే ప్రఽథమం.
మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావును పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (జాతీయ రాజకీయ వ్యవహారాలు)గా నియమించారు. ఈ పదవి కూడా కొత్తదే. అంత సీనియర్లు కాకపోయినా తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణిని పొలిట్‌బ్యూరోలోకి తీసుకున్నారు. వీరిలో అనిత ఎస్సీ, సంధ్యారాణి ఎస్టీ వర్గానికి చెందిన వారు.
ఒక దశలో పార్టీ రాష్ట్ర కమిటీ అధ్యక్ష పదవికి పేరు వినిపించిన బీద రవిచంద్ర యాదవ్‌ను కేంద్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆయనకు పార్టీ అనుబంధ సంఘాల బాధ్యతను అప్పగించారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చిన కర్నూలు జిల్లా పార్టీ నేత కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి పార్టీ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును కూడా ఉపాధ్యక్షుడిగా నియమించారు.