తెలంగాణ రాష్ట్రంలో రోజుకు దాదాపు 50 శాతం మేర కరోనా పాజిటివ్ కేసులు రిపోర్టు కావడం లేదని, కరోనా లక్షణాలున్నప్పటికీ భయంతో పరీక్షలు చేయించుకునేందుకు జనం ముందుకు రావడం లేదని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా(ఆస్కీ) సంస్థ అధ్యయనంలో తేలింది. మిగతారాష్ట్రాలతో పొల్చితే రాష్ట్రంలో కరోనా వృద్ధిరేటు తగ్గుతోందని ఆస్కీ తెలిపింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై ఆస్కీ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ సుబోధ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ సశ్వాత్ మిశ్రా అధ్యయనం చేశారు.
గురువారం ఆన్‌లైన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధ్యయన వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో డిసెంబరు చివరినాటికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగు రెట్లు పెరుగుతుందని పేర్కొన్నారు. అప్పటికి ప్రతి రోజు సగటున 4,697 పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశముందని తెలిపారు. పరీక్షల సంఖ్య నాలుగు రెట్లు, యాక్టివ్ కేసుల సంఖ్య మూడు రెట్లు, మరణాల సంఖ్య రెండు రెట్లు పెరుగుతుందని పేర్కొన్నారు.
డిసెంబరు 31 నాటికి యాక్టివ్ కేసుల సంఖ్య 91,868కి పెరుగుతుందని, ప్రతి రోజు 1,54,228 పరీక్షలు చేస్తారని వివరించారు. రోజుకి 3,616 మంది కోలుకుంటారని, 16 మంది కరోనాతో మరణిస్తారని అంచనా వేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రతి 1000 మందిలో 96 మందికి కరోనా పరీక్షలు చేశారని, దక్షిణ భారతదేశంలో 126 మందితో ఏపీ తొలిస్థానంలో ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతి వెయ్యి మందికి 67 మందికే పరీక్షలు చేస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా పరీక్షించిన ప్రతి 13 మందిలో ఒకరికి పాజిటివ్ నిర్ధారణ అయితే.. తెలంగాణలో 17 మందిలో ఒకరికి కరోనా సోకినట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రతి 29 రోజులకు కేసులు డబుల్ అవుతున్నాయని చెప్పారు.
జీహెచ్‌ఎంసీ కన్నా మహబుబాబాద్, మెదక్, జగిత్యాల, నారాయణపేట, వరంగల్ రూరల్‌లో కేసుల పెరుగుదల ఎక్కువగా ఉందని వివరించారు. ప్రధానంగా వరంగల్ రూరల్, నారాయణపేట జిల్లాల్లో గత వారంతో పొల్చితే ఈ వారం 11 శాతం పెరుగుదల కనిపించిందని వివరించారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తగి న చర్యలు తీసుకోవాలని ఆస్కీ ప్రతిపాదనలు చేసింది. కొవిడ్ ప్యాకేజీని ఆరోగ్యశ్రీలో చేర్చాలని, పేదలకు ఉచితంగా కరోనా చికిత్స అందించాలని పేర్కొంది.