హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. హైదరాబాద్ పరిధిలో శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు.
పాత భవనాల యజమానులకు నోటీసులు జారీ చేయాలని, ఆ భవనాల్లో నివసిస్తున్న వారిని తక్షణమే ఖాళీ చేయించాలని కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ నష్టాన్ని నివారించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పాత భవనాల యజమానులకు తెలియజేయాలని అధికారులకు సూచించారు.
ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని అసిస్టెంట్ సిటీ ప్లానర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బందిని ఆదేశించారు.