త్వరలో జరగనున్న ఎన్నికల్లో పట్టభద్రుల ఓట్ల నమోదు, ఎన్నికల్లో గెలుపు ఎత్తుగడలపై మంత్రులు నేతలతో సమీక్ష చేశారు. అభ్యర్థి ఎవరైనా, గెలుపు ఖాయంగా పని చేయాలని నిర్ణయించారు. పార్టీ బాధ్యులు, వివిధ విభాగాల బాధ్యులతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై మంత్రులిద్దరూ సుదీర్ఘంగా చర్చించారు.
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మండలి ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగూర్ల వెంకన్న, రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, ఎంపీలు బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, నన్నపనేని నరేందర్, గండ్ర వెంకట రమణారెడ్డి, డిసిసిబి చైర్మన్ మార్నేని రవిందర్ రావు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బస్వరాజు సారయ్య, సాంబారి సమ్మారావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, గులాబీ జెండా, సిఎం కెసిఆర్ అభివృద్ధి-సంక్షేమ ఎజెండా ప్రజల గుండెల నిండా పదిలంగా ఉందన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి-సంక్షేమ పథకాలే ప్రతి ఎన్నికలోనూ పార్టీని గెలిపిస్తున్నాయన్నారు. ప్రభుత్వ చేపడుతున్న అన్ని పథకాలు ప్రజలకు చేరువయ్యాయన్నారు. మనం చేయాల్సిందల్లా పకడ్బందీగా ఓట్ల నమోదు, అర్హత కలిగిన ప్రతి ఒక్కరినీ మిస్ కాకుండా నమోదు చేయాలని చెప్పారు. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలను ఆలోచనా పరులైన పట్టభ్రదులకు తెలిసేలా చేయాలన్నారు. పకడ్బందీగా ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాలని చెప్పారు. క్షేత్ర ప్రణాళిక ముఖ్యమన్నారు. ఇందుకు పార్టీ శ్రేణులు సంసిద్ధంగా ఉన్నాయని, నేతలు వారిని నడిపించాలని చెప్పారు. పరస్పర సహకారం, సమన్వయంతో ఎన్నికల్లో వ్యవహరిద్దామని మంత్రి ఎర్రబెల్లి నేతలకు సూచించారు. పార్టీ ఆలోచనలు, ప్రభుత్వ పథకాలు, సిఎం కెసిఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దిశానిర్దేశానుసారం నడుచుకుంటే ఎన్నికేదైనా గెలుపు నల్లేరు మీద నడికేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.
మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ, ఉప ఎన్నిక ఏదైనా గెలుపు ఖాయంగా ఇప్పటి వరకు టిఆర్ ఎస్ పని చేస్తున్నదన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ గారు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతు కోసం అనేక కార్య్రమాలు చేస్తున్నారని, ఎక్కువ మంది పట్టభద్రులు రైతు బిడ్డలే నని , వారంతా తెలంగాణ రాష్ట్ర సమితికి అనుకూలంగా ఉండేటట్లు చేయడమే మనముందు ఉన్న లక్ష్యం అన్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో మంచి అభిప్రాయం ఉందన్నారు. అలాగే ప్రభుత్వ అభివృద్ధి-సంక్షేమ పథకాలు, తాజా చట్టాలను పట్టభద్రులకు కూడా బాగా అర్థం చేయాలన్నారు. ఓటర్ల నమోదును పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ప్రణాళికాబద్ధంగా వ్యవరించాలని చెప్పారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ మూడు జిల్లాల నుంచి కూడా ప్రజల్లో బాగా పలుకుబడి, అభిమానం ఉన్న నేతలే ఎక్కువగా ఉన్నందున, వాళ్ళంతా ముఖ్యమైన పదువుల్లోనే కొనసాగుతున్నందున, అంతా కలిసి కట్టుగా పని చేస్తే, గెలుపు సులువేనని చెప్పారు.
ఈ సమావేశంలో మంత్రులతోపాటు, పలువురు ప్రముఖ నేతలు, ప్రజాప్రతినిధులు కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. వాటన్నింటినీ నోట్ చేసుకున్న మంత్రులు, ఇలాగే పలు సమావేశాలు నిర్వహించి సమిష్టిగా పని చేసి భారీ మెజారిటీ తో గెలుద్దామని చెప్పారు.