తన పేరిట ఉన్న వ్యవసాయేతర ఆస్తులను సీఎం కేసీఆర్.. నమోదు చేయించుకున్నారు. రాష్ట్రంలో కొన్ని రోజులుగా వ్యవసాయేతర ఆస్తుల వివరాలను నమోదు చేస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా శనివారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి శివారులోని వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించిన వివరాలను గ్రామ కార్యదర్శి సిద్ధేశ్వర్‌కు ముఖ్యమంత్రి స్వయంగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఎర్రవల్లిలోని ఫాంహౌస్ వివరాలతోపాటు కేసీఆర్ ఫొటోను సిబ్బంది యాప్‌లో అప్లోడ్ చేశారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఆస్తులపై ప్రజలకు హక్కు, భద్రత కల్పించేందుకే వివరాలు నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు.
వ్యవసాయ భూముల తరహాలోనే వ్యవసాయేతర ఆస్తులకూ పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా చేపట్టిన స్థిరాస్తుల నమోదు ప్రక్రియ చర్రితలో మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ స్థిరాస్తుల వివరాలను నమోదు చేయించుకోవాలని పిలుపునిచ్చారు.