ఏడేండ్లుగా తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపునకు నాంది పలుకుతాయాని నారాయణఖేడ్ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ ఉప ఎన్నికల నార్సింగి మండల ఇన్‌చార్జి భూపాల్‌రెడ్డి అన్నారు.
మండలంలోని భీమ్‌రావుపల్లి, వల్లూరు, నార్సింగి గ్రామాల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తమ ప్రభుత్వం రైతు బంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి తదితర సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా తమ సంక్షేమ పథకాలు ఆదరణ పొందాయని అన్నారు. రాష్ట్రంలో ప్రతీ ఇంటికి సంక్షేమ ఫలాలు చేరాయని ఆయన తెలిపారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాతే గ్రామాలు అభివృద్ధి చెందాయని అన్నారు.
గ్రామాల్లో సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తున్నామని తెలిపారు. రామలింగారెడ్డి ఆశయం మేరకు దుబ్బాక నియోజకవర్గంలో ప్రతీ గ్రామాన్ని అద్దంలా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఆయన ఆశయ సాధనకు సుజాతారామలింగారెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నార్సింగి ఎంపీపీ సబిత, జడ్పీటీసీ కృష్ణారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.