నాకిప్పటికీ నమ్మబుద్దెయ్యడంలేదు.. నాకు ఇల్లు వస్తుందని కలలో కూడా ఊహించలేదు.. ఇది తునికి భాగ్యమ్మ సంబురం! పేదలు అత్మగౌరవంతో బతుకాలని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా నిర్మించి ఇస్తున్న డబుల్‌బెడ్‌రూం ఇండ్లకు మేడ్చల్ జిల్లా చీర్యాల్‌లో లక్కీడ్రా తీస్తే పేరు వచ్చిన నిరుపేద లబ్ధిదారు ఈమె! ‘ఎన్నడు ఒక్క వెయ్యి రూపాయలు చూడలే సారూ. నాకు రూ.30-40 లక్షల ఇల్లు వచ్చిందని నిన్న మా పంచాయతీ వాళ్లు వచ్చి చెప్పారు. ఏ దిక్కూ లేని మాకు కేసీఆర్ సారే దేవుని లెక్క దిక్కు చూపిండు. మాకు మస్తు సంతోషమైతుంది’ అంటూ చేతులెత్తి మొక్కుతున్నది బక్కాని మల్లమ్మ. వీళ్లే కాదు.. ఇలాంటివాళ్లు ఎందరో. రోజు కూలీలు. రెక్కాడితే గానీ డొక్క నిండని కడుపేదలు. గత 20-30 ఏండ్లుగా గాలికి కొట్టుకుపోయే మరుగుజ్జు గుడిసెల్లో, ఇరుకిరుకు కిరాయి ఇండ్లల్లో మగ్గుతున్న బతుకులు. భవన నిర్మాణ కార్మికులు, భర్తను కోల్పోయి రోడ్డునపడ్డ అభాగ్యులు, పాచిపని చేసుకుంటే తప్ప పూటగడవని నిరుపేదలు. అదే ఊళ్లో పుట్టిపెరిగినా.. ఇప్పటికీ సొంత ఇల్లు కట్టుకోలేని జీవితాలు! ఇప్పుడు ఆ జీవితాల్లో ఒక ఆశ.. ఊహించని రీతిలో తమ బతుకులు మారుతున్న సంతోషం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అద్దె కొంపల్లో బతుకులీడ్చినవారు.. ఇప్పుడు డబుల్‌బెడ్‌రూం ఇండ్లలో అడుగుపెట్టబోతున్నారు. ఆత్మగౌరవంతో తమ జీవితాలను కొనసాగించబోతున్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండల పరిధిలో ఉన్న ఈ గ్రామంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న సుమారు 40 మంది పేదలకు ప్రభుత్వం డబుల్ డబుల్ బెడ్‌రూంలను అందించి, వాళ్ల బతుకులకు ఓ భరోసా కల్పించింది. ఈ నెల 15న లబ్ధిదారులందరూ సామూహిక గృహప్రవేశాలు చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కలల సౌధాలను గ్రామ ప్రజలందరి సమక్షంలో నిర్వహించిన లక్కీడ్రాలో దక్కించున్న పేదల జీవితాలను ‘నమస్తే తెలంగాణ’ గురువారం పలుకరిస్తే ఒక్కొక్కరిదీ ఒక్కో వ్యథ! ఇప్పుడు ఆ కష్టాలు తొలిగిపోయాయని సంబురంగా చెప్తున్నారు.
ఇది నా ఇల్లు అని ఇప్పుడు గర్వంగా దోస్తులకు చూపిస్తా
ఇంతకుముందు మా ఇంటికి రమ్మనాలంటే నామోషీగా ఉండేదిఇంటర్ విద్యార్థిని నిఖిత మనోగతంచిన్నప్పటి నుంచి నేను నా దోస్తులెవ్వరినీ మా ఇంటికి తీసుకురాలేదు. మా ఇంటిని చూస్తే వాళ్లు నాతో దోస్తీ చేస్తరో? లేదో? ఇప్పుడు దోస్తులందరినీ మా ఇంటికి పిలుస్తాను. అందరికీ ఇదే మా ఇల్లని చూపిస్తాను. మేము గర్వంగా చెప్పుకొనేలా లక్షల విలువైన ఇల్లు ఇచ్చిన కేసీఆర్‌కు మేము ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఆయనకు నా సెల్యూట్ అంతే.
వెలుతురున్నది దాని కలచు చీకట్ల వ్యధ బ్రతుకుంది దాని వెంబడిసాగు మరణ కథ కలకాలమీ యిరుల కాపురమ్మెటు చేతు మట్టిపాన్పున మిసిమి మబ్బు కలలను జూతు మరాఠీ కవి కుసుమాగ్రజ్ రచించిన వ్యథార్థుల జీవన కవిత ఇది.
మేడ్చల్ జిల్లా కీసర మండలం, చీర్యాల్ గ్రామంలో రావుల చంద్రకళది ఇలాంటి జీవితం. పుట్టినప్పటినుంచీ అలవికాని దుఃఖమే.. తాళి పడ్డాక తాగుబోతు భర్తతో కష్టాలే.. ఉన్నా లేనట్టు ఉండే పెంకుటిల్లు.. కూలిపోయిందనుకొన్న ఆమె బతుకుకు తెలంగాణ సర్కార్ డబుల్ భరోసానిచ్చింది. వస్తదో రాదో అనుకున్న డ్రా ఒక్కసారిగా వచ్చేసరికి కండ్లనిండా కన్నీరు ఉబికి వచ్చింది. ఆ కన్నీరు పుట్టినప్పటినుంచి ఉన్నవి కావు. ఒక్క గది ఉంటే చాలు అనుకున్న జీవితానికి ఆత్మగౌరవంతో బతికేలా ఏకంగా డబుల్ బెడ్‌రూం ఇల్లు రావడంతో పట్టలేని ఆనందంతో వచ్చిన ఆనందబాష్పాలు. ఆమె నోట వచ్చింది ఒకే మాట.. కేసీఆర్ సారు.. సల్లగుండాలె..
ఆయన గుండె ఆగింది.. నా ఇల్లు కూలింది..
నా పేరు మల్లమ్మ. నన్ను అందరు ఎడ్డిదంటారు. నాకు తెలివిలేదు. నాకు పుట్టిన ఇద్దరు పిల్లలు ఎడ్డివాళ్లే (మానసిక దివ్యాంగులే). అయ్యా.. నా పెనిమిటి ఆ కష్టం ఈ కష్టం చేసి మమ్ములను సాదేటోడు. చాలా ఏండ్ల కింద ఆర్‌జీకే కాలనీలో మురికికాలువలో పడటంతో ఆయన గుండె ఆగింది. ఇద్దరు పిల్లలతో కలిసి నేను ఉంటున్న పాత ఇల్లు కూలింది. ఓ పెద్దాయన తీసుకువచ్చి, మమ్ములను ఈ ఇంట్లో పెట్టాడు. నా కొడుకు ఏదో ఓ కష్టంజేసి మాకు తెచ్చి పెడుతుంటే పూట గడుస్తుంది. నేను ఎన్నడు ఒక్క వెయ్యి రూపాయలు చూడలే సారూ. నాకు రూ.30-40లక్షల ఇల్లు వచ్చిందని నిన్న మా పంచాయతీ వాళ్లు వచ్చి చెప్పిండ్రు. ఏ దిక్కూ లేని మాకు కేసీఆర్ సారే దేవుని లెక్క దిక్కు చూపిండు. మాకు మస్తు సంతోషమైతుంది.
– బక్కాని మల్లమ్మ
మా ఇల్లు ఇదేనని దోస్తులందరికీ చూపిస్తా
నా పేరు నిఖిత. ఇంటర్ పూర్తి చేశాను. నేను చూసినప్పటి నుంచి మా అమ్మకు కష్టాలే. నా తండ్రిలాంటి తండ్రి మరే బిడ్డకు ఉండొద్దు. మా అమ్మను చంపాలని చూశాడు. రోజు కొట్టేవాడు. నా తల్లి నన్ను, నా తమ్ముడిని ఎన్నో కష్టాలు పడి చదివిస్తున్నది. అయితే అన్నా.. నేను మా దోస్తుల ఇంటికి వెళ్తాను. వాళ్లవి పెద్దపెద్ద బంగ్లాలు. వాళ్ల ఇండ్లతో పోల్చితే మేము ఉంటున్న అద్దె ఇల్లు వాళ్ల కిచెన్ అంత కూడా ఉండదు. అందరూ ‘మీ ఇల్లెక్కడ?’ అని అడుగుతారు. కానీ చిన్నప్పటి నుంచి నేను నా దోస్తులెవ్వరినీ మా ఇంటికి తీసుకురాలేదు. మా ఇంటిని చూస్తే వాళ్లు నాతో దోస్తీ చేస్తారో? లేదో? ఇంత చిన్నా ఇల్లా అని అంటారేమో? అనే భయంతో ఇన్నేండ్లలో ఏ ఒక్కరినీ మేము ఉంటున్న ఇంటికి తీసుకురాలేదు. ఇ ప్పుడు మా అమ్మకు కేసీఆర్ సారు డబుల్ బెడ్‌రూం ఇచ్చిం డు. ఇప్పుడు నా చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు ఉన్న దోస్తులందరినీ మా ఇంటికి పిలుస్తాను. కేసీఆర్ సార్‌కు సెల్యూట్.
– నిఖిత, డబుల్ బెడ్‌రూం పొందిన భాగ్యమ్మ కూతురు
మాకు భరోసా దొరికింది..
నా పేరు తునికి భాగ్యమ్మ. నాకు చిన్నతనంలోనే పోలియో వచ్చింది. 20 ఏండ్ల కిందట మేనబావకిచ్చి పెండ్లి చేశారు. అప్పడు మొదలయ్యాయి నాకు కష్టాలు. నిత్యం తాగివచ్చి చిత్రహింసలు పెట్టేటోడు. బాబు కడుపులో ఉన్నప్పడు నా భర్త వేధింపులు మరింత పెరుగడంతో బిడ్డను తీసుకొని మా పుట్టిల్లు (చీర్యాల్)కు వచ్చాను. కూలినాలి చేసి పిల్లలను సాకేదాన్ని. సొంత ఇల్లు లేక ఎన్నో కష్టాలు పడ్డ. బతికి ఉన్నప్పుడు నాకు దూరమైండు.. ఇప్పుడు మొత్తానికే లేకుండా పోయాడు. తర్వాత ఆశావర్కర్‌గా పనికి చేరాను. కేసీఆర్ సారు వచ్చాక ఆశా వర్కర్ల గౌరవ వేతనం పెరిగింది. నాకు పింఛన్ రూ.3000 వస్తుంది. దివ్యాంగురాలిననే బాధ లేదిప్పుడు. నిన్న డబుల్ బెడ్‌రూంల కోసం తీసిన డ్రాలో నా పేరు వచ్చింది.ఏ దిక్కులేని నన్ను కేసీఆర్ సారు ఆదుకున్నడు. ఆయన పుణ్యానే నాకు డబుల్ బెడ్‌రూం ఇల్లు వచ్చింది.
– తునికి భాగ్యమ్మ
గుడిసె బతుకు కాకుండా చేసిన సీఎం
నాకు పెండ్లి అయినప్పటి నుంచి ఇల్లు లేదు. ఊర్లో ట్రాన్స్‌ఫార్మర్ పక్కనే ఉన్న గుడిసెలోనే మా బతుకు. నేను ఇండ్లల్లో పని చేస్తుంటాను. మా ఆయన కూలినాలి చేస్తాడు. ఆ గుడిసెలోనే మాకు ఇద్దరు పిల్లలు పుట్టారు. అక్కడే పెద్దయ్యారు. నాకు ఎప్పుడు అనిపిచ్చేది.. నా బతుకంతా గుడిసె బతుకేనా అని! కానీ నిన్న మా గ్రామ పంచాయతీ దగ్గర తీసిన డ్రాలో నా పేరు వచ్చింది. మాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావడంలేదు. నా జీవితంలో డబుల్ బెడ్‌రూం ఇంట్లో ఉంటానని కలలో కూడా ఊహించలేదు. 25 ఏండ్ల సందటి రోడ్డు పక్కన గుడిసెలో ఉన్న నాకు రూపాయి ఖర్చు లేకుండానే ఔటర్ రింగురోడ్డు పక్కన డబుల్ బెడ్‌రూం ఇంటిని ఇచ్చి మాది గుడిసె బతుకు కాకుండ చేసిన కేసీఆర్‌ను దేవుని లెక్క మొక్కుతం.
– రామగళ్ల కౌసల్య
ఒక్క గది చాలనుకుంటే.. డబుల్ ఇల్లు వచ్చింది
నా పేరు చంద్రకళ. చిన్న వయసులోనే నాకు పెండ్లి చేసిండ్రు. అప్పటి నుంచి నా కండ్ల తడారలేదు. చాలా ఏండ్ల కిందట కట్టిన చిన్న పెంకుటిల్లు మాది. వానొస్తే ఎక్కడి నుంచి కురుస్తదో.. ఏ గోడ కూల్తదో తెలియకుండే. మేస్త్రీ పని చేసే నా భర్త తాగుడుకు మరిగిండు. ఎంత చెప్పినా మారలే. నన్ను కన్న కష్టాలు పెట్టిండు. ఇట్లనే కొన్నేండ్లు గడిసినయి. మాకో బిడ్డ పుట్టింది. కొద్దిరోజులకే నా పెనిమిటి కాలం జేసిండు. ఆ పెంకుటిల్లు కూలింది. నేను, నా బిడ్డ రోడ్డున పడ్డం. ఉన్న ఒక్కగానొక్క బిడ్డను వెంటబెట్టుకొని చీర్యాల్‌లోనే ఓ ఇంట్లో అద్దెకుంటూ మేస్త్రీ వద్ద రోజు కూలీగా చేరిన. ఉన్ననాడు తిన్నం.. లేని నాడు పస్తులున్నం. మనుషులు ఎట్ల ఉన్నది చూస్తారు గానీ, మా లోపల ఉన్న బాధను ఎవ్వరు జూస్తారు. పెండ్లీడుకొచ్చిన నా బిడ్డకు పెండ్లిజేయ్యాలె.. అప్పుడు పెంకుటింట్లో నా పెనిమిటి వాటాను అమ్మిన.. వచ్చిన పైసలతో నా బిడ్డ లగ్గం జేసిన. కేసీఆర్ సారూ.. సల్లగుండ. నా బిడ్డ పెండ్లికీ కల్యాణలక్ష్మి ఇచ్చిండు. నా బిడ్డ, అల్లుడు నేను అద్దెకుంటున్న ఆ చిన్న ఇంటికి వచ్చినప్పుడు.. నాకు ఒక్కదాన్ని పడుకునేందుకే జాగ సరిపోని ఇంట్లో నా బిడ్డ అల్లుడు ఏడ పడుకుంటారోనని పక్కకు పోయి ఏడ్చేదాన్ని. అందుకూ నా అల్లుడు ఎప్పుడు వచ్చినా నా బిడ్డను దించి మళ్లీ వాళ్ల ఇంటికి వెళ్లేటోడు. అప్పుడు ఇంకా బాధయ్యేది. ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయోనని నేను, నా బిడ్డ బాధపడని రోజులేదు. అందరు డబుల్ బెడ్‌రూం ఇండ్లకు దరఖాస్తు చేస్తుంటే.. నేనూ చేసిన. చాలామంది ‘మనకేడ వస్తదిలే’ అనేటోళ్లు. బుధవారం లక్కీడ్రాలో నా పేరు వచ్చింది. పెద్దగా ఒక్క రూం ఉంటే చాలనుకున్న నాకు మా ఊరిలోనే ఔటర్ రింగురోడ్డు పక్కనే డబుల్ బెడ్‌రూం ఇల్లు ఇచ్చింది. నా దగ్గర నయా పైసా తీసుకోకుండానే.. నాకు 40లక్షల విలువైన ఇల్లును ఇచ్చిన.. ఆ కేసీఆర్ సార్ సల్లంగుండాలే. బతికి నన్ని రోజులు సార్‌కు రుణపడి ఉంట.
Source : Namasthe Telangana