ఫోర్బ్స్ భారతీయ కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ ఆధిపత్యం కొనసాగుతున్నది. వరుసగా 13వ ఏడాదీ దేశ సంపన్నులలో అగ్రస్థానంలో నిలిచారు. ఈ ఏడాదికిగాను గురువారం విడుదలైన లిస్ట్‌లో 88.7 బిలియన్ డాలర్ల (రూ.6,49,639 కోట్లు) సంపదతో ముకేశ్ మరోసారి మొదటి ర్యాంక్‌ను నిలబెట్టుకున్నారు. నిరుడుతో పోల్చితే ఈసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత సంపద 37.3 బిలియన్ డాలర్లు ఎగబాకడం గమనార్హం.
కరోనాలోనూ సంపద పరుగు
యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్.. దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేసింది. లాక్‌డౌన్‌తో వ్యాపార, పారిశ్రామిక రంగాలు స్తంభించిపోగా, అన్ని వర్గాలు కుదేలయ్యాయి. అయినప్పటికీ ఈ ఏడాదికిగాను విడుదలైన తాజా ఫోర్బ్స్ జాబితాలో టాప్-100 భారతీయ శ్రీమంతుల సంపద గతంతో పోల్చితే 14 శాతం పుంజుకోవడం విశేషం. వీరందరి ఉమ్మడి సంపద 517.5 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇక టాప్-10లోకి కొత్తగా సైరస్ పూనవాలా వచ్చి చేరారు. పుణెకు చెందిన సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) చైర్మన్ ఈయన. ప్రపంచంలోనే వ్యాక్సిన్ల తయారీలో ఎస్ఐఐ అగ్రగామిగా ఉన్నది.
టాప్-100లో నలుగురు తెలుగువారు
ప్రస్తుత సంవత్సరానికిగాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన దేశీయ కుబేరుల జాబితాలో నలుగురు తెలుగువారు ఉన్నారు. వీరిలో మురళీ దివీస్, రెడ్డీస్ కుటుంబం, పీపీ రెడ్డి, రామ్ ప్రసాద్ రెడ్డిలకు చోటు లభించింది.
సెప్టెంబర్ చివరి నాటికి ఆయా కంపెనీల షేరు విలువ ఆధారంగా ఫోర్బ్ ఈ జాబితాను రూపొందించింది.