తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) కిరీటం మళ్లీ టీఆర్‌ఎ్‌సకే దక్కుతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారకరామారావు ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో పార్టీకి సానుకూల వాతావరణం ఉండటంపై సంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం ఇక్కడ ప్రగతి భవన్‌లో జీహెచ్‌ఎంసీ పరిధిలోని నియోజకవర్గాలకు పార్టీ ఇన్‌చార్జిలుగా ఉన్న ఎమ్మెల్యేలతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
జీహెచ్‌ఎంసీకి చెందిన 150 డివిజన్లలో పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. వివిధ అంశాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని పార్టీ ఇన్‌చార్జిలు కేటీఆర్‌కు నివేదించారు. మెజారిటీ డివిజన్లలో పార్టీ విజయానికి ఢోకా లేదని తెలిపారు. అదే సమయంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని నియోజకవర్గాలు, డివిజన్ల వారీగా తన వద్ద ఉన్న సమాచారాన్ని మంత్రి కేటీఆర్… పార్టీ ఇన్‌చార్జిలతో పంచుకున్నారు.
వివిధ సర్వేలు, అంతర్గత నివేదికల సారాంశాన్ని వివరించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సొంతంగా మేయర్ పదవి చేజిక్కించుకుం టుందనే అభిప్రాయాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు.ఇందుకు కో-ఆప్షన్ సభ్యుల మద్దతు కూడా అవసరం పడబోదనే విశ్వాసాన్ని వెలిబుచ్చారు. ‘సెంచరీ’ డివిజన్లను గెలుచుకోవడం ఖాయమని అభిప్రాయపడ్డారు.