బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడుపడుచులకు ప్రభుత్వం అం దించే బతుకమ్మ చీరల పంపిణీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్నది. 287 డిజైన్లలో, విభిన్న రంగుల్లో తయారుచేసిన కోటి చీరెలను ఇప్పటికే జిల్లాలకు పంపించారు.
వీటి కోసం రూ.317 కోట్లను ప్రభుత్వం వెచ్చింది. తెల్లకార్డు ఉండి, 18 ఏండ్లు నిండిన మహిళలకు వీటిని పంపిణీ చేస్తారు. ఆయా జిల్లాలు, నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చీరెలను పంపిణీ చేస్తారు.
స్థానికంగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మహిళా సంఘాల ద్వారా పంపిణీ చేయడమా లేక ఒకేచోట భౌతిక దూరం పాటిస్తూ వాటిని అందించాలా అన్నదానిపై జిల్లా కలెక్టర్లకు అధికారం ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బతుకమ్మ చీరెల పంపిణీ కోసం గత నాలుగేండ్లలో ప్రభుత్వం రూ.1,033 కోట్లు ఖర్చు చేసింది.