పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ పెద్దన్నగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. ఓదెల మండలంలోని 11 గ్రామాల్లోని 155 మందికి రూ. 1.56 కోట్ల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంగళవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, త్వరలోనే 57 ఏళ్ల వయసు నిండిన వారికి పింఛన్ పథకం అమల్లోకి రానుందని తెలిపారు. మడక చెక్‌డ్యాం కరకట్ట వరద ఉధృతి కారణంగా కొట్టుకుపోయిన పొలాలకు నష్ట పరిహారం అందించేలా ప్రయత్నించనున్నట్లు తెలిపారు. అలాగే చెక్‌డ్యాంను రెండు మీటర్ల ఎత్తు పెంచి నిర్మింపజేస్తామన్నారు.
నియోజకవర్గానికి మరో 13 చెక్‌డ్యాంలు మంజూరైనట్లు వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ కునారపు రేణుకాదేవి, జడ్పీటీసీ గంట రాములు, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ పల్లె కుమార్‌గౌడ్, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌బీఎస్ మండలాధ్యక్షుడు కావటి రాజుయాదవ్, మ్యాడగోని శ్రీకాంత్‌గౌడ్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ఆళ్ల రాజిరెడ్డి, తహసీల్దార్ రాంమోహన్, ఎంపీడీవో సత్తయ్య, గిర్దావర్లు వినయ్‌కుమార్, రాజేందర్ పాల్గొన్నారు.