దేశ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరమైన రీతిలో పతనమవుతున్నది. కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం దానిని చక్కదిద్దటంపై దృష్టిపెట్టడానికి బదులు, తమ చేతిలో అధికారాల కేంద్రీకరణకు, రాష్ర్టాల ఫెడరల్ హక్కులు హరించేందుకు, దేశ సంపదలను పూర్తిగా ప్రైవేట్ రంగానికి ధారాదత్తం చేసేందుకు కంకణం కట్టుకున్నట్లు వ్యవహరిస్తున్నది. దీనంతటి మధ్య నిపుణులు 1991 తరహా ఆర్థిక సంస్కరణలను తిరిగి చేపట్టవలసిన అవసరం ఏర్పడిందంటున్నారు.
ఈ నెల 25న విడుదలైన నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లయిడ్ ఎకనామిక్ రిసెర్చ్ (ఎన్సీఏఈఆర్) నివేదికను గమనించండి. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఆ సంస్థ అంచనా ప్రకారం దేశ ఆర్థికవ్యవస్థ ఈ మొత్తం ఆర్థిక సంవత్సరం (2020-21)లోనే 12.6 శాతం కుంచించుకుపోయే ప్రమాదం ఉంది. ఇవి తాజా లెక్కలు. ఇంతకుముందు కేంద్ర ఆర్థికశాఖతో పాటు, పలువురి అంచనాల మేరకు మొదటి క్వార్టర్లో దాదాపు 24 శాతం తగ్గినా ఆ తర్వాతి మూడు క్వార్టర్లలో ఇది మెరుగుపడుతూ రాగలదని ఆశించారు. ఎన్సీఈఆర్ అయితే మరికొంత ఆశాభావం చూపుతూ మొత్తం ఆర్థిక సంవత్సరం చివరినాటికి బాగా కోలుకుని 1-2 శాతం వృద్ధి సాధించగలదన్నది. కేంద్ర ఆర్థికశాఖ ఏమీ స్పష్టంగా మాట్లాడక ఇంచుమించు మౌనం వహించింది. అటువంటిది ఇదే ఎన్సీఏఈఆర్ తాజాగా తన ఆశాభావాన్ని తానే వదలివేసుకుంటూ వచ్చే మార్చిలో ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి దేశ ఆర్థికవ్యవస్థ 12.6 శాతం పతనం కాగలదని హెచ్చరించింది. ఇప్పటికే రాష్ర్టాలకు జీఎస్టీ పరిహారం, ఎంపీలాడ్స్ నిధులు ఇవ్వలేని దుస్థితి ఏర్పడింది.
ఇది మామూలు విషయం కాదు. కరోనాకు ముందునుంచే మన ఆర్థికవ్యవస్థ కేంద్ర ఆర్థిక విధానాల వల్ల కొంత, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా కొంత దెబ్బతింటుండటం తెలిసిందే. కరోనా రాకతో ఈ స్థితి మరింత తీవ్రం కావటం కూడా నిజమే. కానీ ఈ ఇక్కట్లను ఎదుర్కొనేందుకు మోదీ ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలు తీసుకోవటం లేదని, పైగా మరింత నష్టదాయక విధానాలు అవలంబిస్తున్నదనేది జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ప్రముఖులైన నిపుణుల విమర్శ. వీరిలో సాక్షాత్తూ నరేంద్రమోదీ ఆర్థిక సలహాదారులుగా పనిచేసిన వారు కూడా ఉండటం విశేషం. కరోనా కాలపు ఆర్థికనష్టాలను ఎదుర్కొనేందుకు అనేక ఇతర దేశాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. సుప్రసిద్ధ ఆర్థిక సంస్థ ‘ఫిచ్’ అంచనా (ఇదే సెప్టెంబర్ ఆరంభంలో) ప్రకారం.. మొత్తం ప్రపంచపు ఆర్థికవ్యవస్థ 4.4 శాతం వరకు కుంచించుకుపోనున్నది. ఒక్క చైనాది మాత్రం 2.7శాతం అధికం కానున్నది. చైనాను పక్కన ఉంచినా ప్రపంచంపై ప్రభావం మైనస్ 4.4 శాతం కాగా, భారతదేశంపై ఏకంగా 12.6 శాతం కానుండటం గమనార్హం. ఇది తీవ్ర ఆందోళనకరమైన విషయమని వేరే చెప్పనక్కరలేదు.
ఇది చాలదన్నట్లు, మోదీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొనకపోవటమే గాక, ఆర్థిక పరిస్థితులపై పారదర్శకత కూడా చూపటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్థికస్థితి ఈ విధంగా ఉండటం వర్తమాన సంవత్సరానికే పరిమితం కాదని, బహుశా మరొక రెండు సంవత్సరాలు కొనసాగవచ్చునన్నది పై నివేదికలో ఎన్సీఏఈఆర్ అంచనా. ఆ తర్వాత నైనా మెరుగుపడేందుకుకూడా షరతులున్నాయనేది వేరే విషయం. ప్రభుత్వ ఆర్థికవిధానం, ద్రవ్యవిధానం రెండూ కూడా ఈ క్లిష్టస్థితిని ఎదుర్కొనగల విధంగా లేవని పై నివేదిక వ్యాఖ్యానిస్తూ.. 1991 నాటి (పీవీ నరసింహారావు) సంస్కరణల స్థాయిలో తిరిగి సంస్కరణలు చేపడితే తప్ప ఉపయోగం లేదని అభిప్రాయపడింది. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఇటీవల రాసిన పుస్తకం ‘ద ఇండియా వే’లోనూ ఇదే సూచన చేశారు. కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉన్నాయి? ఉదాహరణకు బ్లూమ్ బర్గ్ ఇండెక్స్ ప్రకారం.. కరోనా అయిదు నెలల కాలంలో ముకేశ్ అంబానీ సంపదలు 48 బిలియన్ డాలర్ల మేర పెరిగాయి. అదానీ స్థితి ఇదే విధంగా ఉంది. కరోనా కాలాన్ని ప్రతిపక్షాల బలహీనతను అడ్డుపెట్టుకొని, బడ్జెట్తోనే ఆరంభించి ప్రైవేటీకరణలు అడ్డదిడ్డంగా చేస్తున్నారు. ఒక దేశంలో క్లిష్టపరిస్థితులు ఏర్పడి అందరూ దిగ్భ్రాంతిలో ఉన్నప్పుడు ఆ స్థితిని అనువుగా చేసుకొని వేగంగా ప్రైవేటీకరణలు చేయాలని మొదట సూత్రీకరించిన ఆర్థికవేత్త షికాగో స్కూల్కు చెందిన మిల్టన్ ఫ్రీడ్మన్. ఆయన వద్ద శిష్యరికం చేశారా అన్నట్లు వ్యవహరిస్తున్నది ప్రభుత్వం. ఫలితంగా క్రోనీ క్యాపిటలిస్టులు బాగుపడి, ధనిక-పేద తారతమ్యాలు పెరుగుతుండగా. దేశ ఆర్థికవ్యవస్థ అధ్వాన్నమవుతున్నది.
ఇదే పద్ధతిలో మరొకవైపు రాష్ర్టాల ఫెడరల్ అధికారాలను హరించేందుకు మొదటినుంచే ప్రయత్నిస్తున్న మోదీ నాయకత్వం, కరోనాను అనువుగా చేసుకొని వేగాన్ని పెంచింది. ఆయనే అన్న సహకార ఫెడరలిజాన్ని ప్రహసనంగా మార్చింది. విద్యుత్తు, జలవనరులు, విద్య తదితర రంగాలకు తోడు తాజాగా వ్యవసాయాన్ని తన అధీనంలోకి తెచ్చుకోవటం ప్రైవేట్ కంపెనీలకు అప్పగించటం లక్ష్యంగా పనిచేస్తున్నది. ఇందుకు నిరసనగా మొదట మోదీ ప్రభుత్వం నుంచి వైదొలిగిన అకాలీలు శనివారం నాడు ఎన్డీయే నుంచి నిష్క్రమించారు. చివరకు దేశంలో అధ్యక్ష వ్యవస్థను తీసుకురాగలరో లేదో తెలియదు గాని, అందుకు తీసిపోని విధంగా మోదీ నాయకత్వం అధికార కేంద్రీకరణను మాత్రం వేగంగా సాగించటం కనిపిస్తున్నది. కరోనా, మతం, దేశభక్తి, చైనా ఆగడం వంటివి దేశ ప్రజల దృష్టిని మళ్లించటం మోదీకి బాగా కలిసి వస్తున్నది. ప్రజలు ఈ రెండు స్థితులను వేరుచేసి వాస్తవ సమస్యలను గుర్తించటం చాలా అవసరం.