తరాలు మారినా ఎందరో నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా పాటలు పాడి.. ప్రాణం పోసిన సూపర్ సింగర్ ఎస్పీ బాలు. తెలుగులోనే కాదు ఉత్తరాదిన కూడా పాడి తన సత్తా చాటిన బాలూ హిందీలో తొలిసారి పాడిన ‘ఏక్ దూజేలియే’ చిత్రంలో.. అద్భుతంగా పాడి అక్కడి వారిచేత శభాష్ అనిపించుకున్నాడు. ఈ సినిమాకు కూడా ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డు దక్కడం విశేషం. ఈ విధంగా తెలుగు తో పాటు హిందీ, తమిళం, కన్నడ లాంటి నాలుగు భాషల్లో కలిపి ఆరు సార్లు జాతీయ ఉత్తమ గాయకుడిగా నిలవడం ఒక్క బాలసుబ్రహ్మణ్యానికే చెల్లింది.
తొలిసారి శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రానికి పాట పాడిన బాలు రూ.300 రెమ్యురేషన్ తీసుకున్నారు. ఆ రోజుల్లో ఘంటసాలగారు 500 రూపాయలు తీసుకునేవారు. తొలి రెమ్యునరేషన్ అందుకున్న బాలు ఎంతో సంతోషించారు. తన సొంత డబ్బుతో ఫ్రెండ్స్‌తో కలిసి బయటకు వెళ్లి గులాబ్‌జామూన్, మసాలాదోశ తిన్నారు. అదే రోజున జేమ్స్ బాండ్ సినిమాకు కూడా వెళ్ళినట్టు బాలు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.
శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రంలో పాట పాడిన తర్వాత బాలు కన్నడ పాట పాడారు. దానికి రెమ్యునరేషన్ 150 రూపాయలు. ఇది చూసి తన ఫ్రెండ్ ఇంతనే అన్నాడట. వందరూపాయలు అంటేనే పెద్ద విశేషం. ముందు నాన్నకు తిరిగి డబ్బులు పంపించాలనే ఆలోచన లేదు. తెప్పించుకోకూడదనే ఆలోచన అంతే ఉండేదని బాలు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 500 రూపాయలు అంటే చాలా పెద్దపారితోషికం అని దానిని చెక్ రూపంలో తీసుకున్నానని బాలు గతంలో అన్నారు.