ఐపీఎల్-13వ సీజన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ఘనంగా ఆరంభించింది. కీలక ఆటగాళ్లు లేకపోయినా.. జట్టుకు తగిన ప్రాక్టీస్ లభించకపోయినా ఏమాత్రం ఒత్తిడికి లోను కాని ఎంఎస్ ధోనీ సేన 5 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై నెగ్గింది. దీంతో వరుసగా ఐదు పరాజయాల తర్వాత ముంబైపై ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. అంబటి రాయుడు (48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 71), డుప్లెసి (44 బంతుల్లో 6 ఫోర్లతో 58 నాటౌట్) అదరగొట్టగా చివర్లో సామ్ కర్రాన్ (6 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 18) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లకు 162 పరుగులు చేసింది. సౌరభ్ తివారీ (42), డికాక్ (33) రాణించగా ఎన్‌గిడికి మూడు, జడేజాకు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో చెన్నై 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు చేసి నెగ్గింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా రాయుడు నిలిచాడు.
రాయుడు, డుప్లెసి శతక భాగస్వామ్యం: తొలి రెండు ఓవర్లలోనే ఓపెనర్లను కోల్పోయిన చెన్నైని రాయుడు, డుప్లెసి గట్టెక్కించారు. మొదట వాట్సన్ (4)ను బౌల్ట్ ఎల్బీ చేయగా.. ఆ తర్వాత విజయ్ (1)ను ప్యాటిన్సన్ ఎల్బీ చేసినా రీప్లేలో బంతి వికెట్లను మిస్ అవుతున్నట్టు కనిపించింది. కానీ విజయ్ మాత్రం రివ్యూను కోరలేదు. ఈ దశలో రాయుడు, డుప్లెసి ముంబైని ఆడుకున్నారు. ముఖ్యంగా అంబటి సూపర్ షాట్లతో చెలరేగాడు. ఆరో ఓవర్‌లో వరుసగా 4,6 బాదిన అతను ఆ తర్వాత పదో ఓవర్‌లో రెండు ఫోర్లతో ఫామ్‌ను చాటుకున్నాడు. క్రునాల్ ఓవర్‌లో ముందుకు వచ్చి ఆడిన రాయుడు కళ్లు చెదిరే సిక్సర్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో 34 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించగా అటు జట్టు కూడా 13.1 ఓవర్లలోనే వంద పరుగులు పూర్తి చేసుకుంది. అటు రాయుడు భారీ షాట్‌కు ప్రయత్నించి 16వ ఓవర్‌లో రాహుల్ చాహర్‌కు దొరికిపోయాడు.
దీంతో మూడో వికెట్‌కు 115 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. అప్పటికి జట్టు 24 బంతుల్లో 42 పరుగులు చేయాల్సి ఉంది. వచ్చీ రావడంతోనే రెండు ఫోర్లతో ఆకట్టుకున్న జడేజాను క్రునాల్ ఎల్బీ చేశాడు. ఈ దశలో సామ్ కర్రాన్ (18) ఆడిన ఆరు బంతుల్లోనే రెండు సిక్సర్లు, ఫోర్ సాధించి లక్ష్యాన్ని తేలిక చేశాడు. ఇక బుమ్రా వేసిన 19వ ఓవర్‌లో 11 పరుగులు రావడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. అదే ఓవర్‌లో బరిలోకి దిగిన ధోనీ రివ్యూ కోరి డకౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇక ఆఖరి ఓవర్‌లో కావాల్సిన 5 పరుగులను డుప్లెసి తొలి రెండు బంతులను ఫోర్లుగా మలిచి గెలుపు ఖాయం చేశాడు.
చివర్లో కట్టడి: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. వికెట్లు పడుతున్నా రన్‌రేట్‌ను మాత్రం తగ్గకుండా చూడడంతో ముంబై ఓ దశలో 10 ఓవర్లలో 85 పరుగులతో ఉంది. కానీ కీలక సమయంలో ధోనీ బౌలర్లను మారుస్తూ ముంబైని డెత్ ఓవర్లలో కాస్త కట్టడి చేయగలిగాడు. అటు దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్ మొదటి బంతిని రోహిత్ (12), నాలుగో బంతిని మరో ఓపెనర్ డికాక్ బౌండరీకి తరలించగా తొలి ఓవర్‌లోనే 12 పరుగులు వచ్చాయి. ఎన్‌గిడి ఓవర్‌లో డికాక్ మూడు ఫోర్లతో విరుచుకుపడి 18 పరుగులు రాబట్టాడు. కానీ లెగ్ స్పిన్నర్ పీయూష్ తన మొదటి ఓవర్‌లోనే రోహిత్‌ను అవుట్ చేసి జట్టుకు రిలీఫ్ అందించాడు. దీంతో తొలి వికెట్‌కు 46 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మరుసటి ఓవర్‌లోనే ఊపు మీదున్న డికాక్‌ను కర్రాన్ అవుట్ చేయడంతో ముంబై ఇబ్బందిపడింది.
కానీ సూర్యకుమార్ (17), తివారీ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. సూర్యకుమార్ తర్వాత వచ్చిన హార్దిక్ వరుసగా రెండు సిక్సర్లతో హోరెత్తించగా.. తివారీ వరస ఫోర్లతో చెలరేగుతూ స్కోరును పెంచాడు. ఈ దశలో జడేజా తన ఆఖరి ఓవర్‌లో ఈ ఇద్దరినీ పెవిలియన్‌కు చేర్చాడు. ఈ రెండు క్యాచ్‌లను కూడా బౌండరీ లైన్ దగ్గర డుప్లెసి బ్యాలెన్స్ కోల్పోయినా అద్భుతంగా పట్టేశాడు. అటు పొలార్డ్ వరుస ఫోర్లతో జట్టు 150 రన్స్‌కు చేరింది. కానీ చివరి ఆరు ఓవర్లలో చెన్నై బౌలర్లు రాణించగా ముంబై 41 రన్స్ మాత్రమే చేసి 6 వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా ఎన్‌గిడి తన తొలి రెండు ఓవర్లలో 29 పరుగులివ్వగా ఆ తర్వాత 9 పరుగులకు 3 వికెట్లు తీశాడు.
స్కోరుబోర్డు
ముంబై: రోహిత్ (సి) కర్రాన్ (బి) పీయూష్ 12, డికాక్ (సి) వాట్సన్ (బి) కర్రాన్ 33, సూర్యకుమార్ (సి) కర్రాన్ (బి) దీపక్ చాహర్ 17, సౌరభ్ తివారీ (సి) డుప్లెసి (బి) జడేజా 42, హార్దిక్ పాండ్యా (సి) డుప్లెసి (బి) జడేజా 14, పొలార్డ్ (సి) ధోనీ (బి) ఎన్‌గిడి 18, క్రునాల్ పాండ్యా (సి) ధోనీ (బి) ఎన్‌గిడి 3, ప్యాటిన్సన్ (సి) డుప్లెసి (బి) ఎన్‌గిడి 11, రాహుల్ చాహర్ (నాటౌట్) 2, ట్రెంట్ బౌల్ట్ (బి) దీపక్ చాహర్ 0, బుమ్రా (నాటౌట్) 5, ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 162/9; వికెట్ల పతనం: 1-46, 2-48, 3-92, 4-121, 5-124, 6-136, 7-151, 8-156, 9-156; బౌలింగ్: దీపక్ చాహర్ 4-0-32-2, సామ్ కర్రాన్ 4-0-28-1, ఎన్‌గిడి 4-0-38-3, పీయూష్ చావ్లా 4-0-21-1, రవీంద్ర జడేజా 4-0-42-2.
చెన్నై: మురళీ విజయ్ (ఎల్బీ) ప్యాటిన్సన్ 1, షేన్ వాట్సన్ (ఎల్బీ) బౌల్ట్ 4, డుప్లెసి (నాటౌట్) 58, అంబటి రాయుడు (సి అండ్ బి) దీపక్ చాహర్ 71, జడేజా (ఎల్బీ) క్రునాల్ 10, కర్రాన్ (సి) ప్యాటిన్సన్ (బి) బుమ్రా 18, ధోనీ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 4, మొత్తం: 19.2 ఓవర్లలో 166/5; వికెట్ల పతనం: 1-5, 2-6, 3-121, 4-134, 5-153; బౌలింగ్: ట్రెంట్ బౌల్ట్ 3.2-0-23-1, ప్యాటిన్సన్ 4-0-27-1, బుమ్రా 4-0-43-1, క్రునాల్ పాండ్యా 4-0-37-1, రాహుల్ చాహర్ 4-0-36-1,