వీర రుద్రుల భూమి యెవనిది?
నీరు ఎవనిది? నింగి యెవనిది?
భోగమెవనిది? యోగ మెవనిది?
భుక్తి కరువుకు మూలమెవ్వడు?
అని 69 తెలంగాణ ఉద్యమం నిగ్గదీసిన నాటి నుంచి.. ప్రశ్నల కొడవళ్లతో తెలంగాణ అలుపులేని పోరాటం చేసింది. అనన్య త్యాగాల ఫలంగా ఫలించిన తెలంగాణ… ఉద్యమ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సమస్యల చిక్కుముడులన్నింటినీ ఒక్కొక్కటిగా విప్పుకొంటున్నది. ఆ ప్రస్థానంలో భాగమే కొత్త రెవెన్యూ చట్టం. మన తెలంగాణ చరిత్రను మలుపు తిప్పగల ఈ బిల్లుకు శాసనసభ శుక్రవారం ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేసింది.
మన్ను బుక్కి అన్నం పంచే రైతన్నకు భూమే సర్వస్వం, స్వర్గం. అలాంటి భూమి తగాదాల్లో పడితే రైతు నిలువునా తండ్లాడుతాడు. అక్రమాలను పెంచే చట్టాలు, అవినీతి పంచే అధికారుల నడుమ నలిగిపోతున్న తెలంగాణ పౌరులను, కర్షకులను ఆదుకునేందుకు.. సుదీర్ఘ మేధో మథనంతో కేసీఆర్ రూపొందించిన ఈ బిల్లుకు శాసనసభలో అధికార, విపక్ష సభ్యులు ముక్తకంఠంతో మద్దతు తెలిపారు.
ఏడు తలల రాక్షసుడిని ఒక్క బాణంతో నేల కూల్చినట్టు, నూరు తలల అవ్యవస్థకు ఒక్క చట్టంతో చరమగీతం పాడారు కేసీఆర్. ఇప్పుడు రైతు రాజో, మంత్రో కాదు; సార్వభౌముడు. ఎకరమో, అద్దెకరమో, గుంటెడో, గజమో.. సర్కారు చూపించే సరిహద్దుల దాకా అతని సామ్రాజ్యమే. అతడే దానికి చక్రవర్తి. ‘ధరణి’లో అతనికంటూ ప్రత్యేకమైన పేజీ ఒకటి తప్పక ఉంటుంది. బాంచెన్ నీ కాల్మొక్త అని ఎవరినీ బతిమిలాడే పని లేదు. ఏ అధికారికీ పొర్లు దండాలు పెట్టే అక్కర్లేదు.
మన తెలంగాణ జాణ
ఎవరికీ దాస్యం చేయదు!
జన్మహక్కునపహరించు
ఉన్మాదులను క్షమించదు!
అన్న కవి వాక్కు నిజమైంది. ఇది పండుగ రోజు. దసరా, దీపావళి ఈసారి ముందే వచ్చాయి. ఈ మట్టిని ప్రేమించే పాలకుడు ఎన్ని గట్టి పనులు చేయగలడన్నదానికిది నిదర్శనం రెవెన్యూ చట్టం. కొందరు చరిత్రను తిరగరాస్తారు. మరికొందరు చరిత్రను సృష్టిస్తారు. కేసీఆర్ ఆ రెండూ చేస్తున్నారు.ఒక రైతు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలోనే ఇలాంటి చట్టం సాధ్యం. రామరాజ్యం ఎక్కడో లేదు. రైతు రాజ్యంలోనే ఉన్నది. ఆ రైతు రాజ్యం తెలంగాణలో ఉన్నది.