హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు (వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి) కింద చేపట్టిన పనులను రాష్ర్ట ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి సభ ముందు ఉంచారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఈ అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.
ఎస్ఆర్‌డీపీ కింద 9 ఫ్లై ఓవర్లు, 4 అండర్‌పాస్‌లు, 3 ఆర్‌యూబీ, ఒక వంతెనతో పాటు ఒక కేబుల్ బ్రిడ్జిని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కింద మొత్తం 18 ప్రాజెక్టులను పూర్తి చేశామన్నారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించామన్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు నగరంలో ఈ ప్రాజెక్టు కింద పలు అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. నగర అభివృద్ధికి దాదాపు రూ. 30 వేల కోట్లకు గానూ రూ. 6 వేల కోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి.
జీహెచ్ఎంసీలో భూ సేకరణ కోసం చర్యలు చేపట్టామన్నారు. హైదరాబాద్ కలెక్టర్‌కు ప్రత్యేక బాధ్యతలు అప్పజెప్పిన తర్వాత భూసేకరణ వేగవంతంగా జరుగుతుందన్నారు. ప్రజా రవాణాను మెరుగుపరిచేందుకు మెట్రోతో పాటు ఆర్టీసీని అభివృద్ది చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.