Home / SLIDER / రెవిన్యూ చట్టం దేశంలోనే సంచలనం

రెవిన్యూ చట్టం దేశంలోనే సంచలనం

తెలంగాణ వచ్చిన రోజున ఎంత సంతోషంగా ఉన్నానో.. ఇవాళ అంతే సంతోషంగా ఉన్నా. తరతరాలుగా ప్రజలు అనుభవిస్తున్న బాధలకు చరమగీతం పాడి, రైతులకు, నిరుపేదలకు, నోరులేనివారికి అండగా నిలిచే చట్టాన్ని తీసుకొస్తున్నాం. సరళీకృతమైన, అవినీతిరహితమైన ఇంత గొప్ప చట్టాన్ని శాసనసభలో ప్రతిపాదిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉన్నది’ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

బుధవారం రాష్ట్ర శాసనసభలో చరిత్రాత్మకమైన రెవెన్యూ చట్టానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌ భావోద్వేగానికి గురయ్యారు. దశాబ్దాలుగా అనేక చిక్కుముళ్లతో, అంతులేని అవినీతితో ప్రజలు పడుతున్న భూ కష్టాలను తొలిగించాల్సిన చారిత్రక అవసరాన్ని సవివరంగా శాసనసభకు వివరించారు. కొత్త రెవెన్యూ చట్టానికి అనుగుణంగా భూమి హక్కులు, పాస్‌పుస్తకాల చట్టం -2020 బిల్లును, గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో) రద్దు చట్టం-2020 బిల్లును సీఎం అసెంబ్లీలో ప్రవేశపెట్టగా, ధరణి వెబ్‌సైట్‌ ద్వారా భూముల బదిలీ ప్రక్రియకు సంబంధించి పంచాయతీరాజ్‌, పురపాలక చట్టాలకు సవరణలు ప్రతిపాదించారు.

ఆ బిల్లులను మంత్రులు కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రవేపెట్టారు. ఈ సందర్భంగా సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. పూర్తి పారదర్శకంగా సేవలు అందించే లక్ష్యంతో ఈ బిల్లులు తెచ్చామని, ఇవి అవినీతి నిర్మూలనకు నాంది పలుకుతాయని చెప్పారు. కొత్త రెవెన్యూ చట్టంలోని ప్రధానాంశాలు.. ఆ చట్టాన్ని తీసుకొని రావాల్సిన అవసరం గురించి సీఎం చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే..

తెలంగాణ భూములకు డిమాండ్‌
నవీనకాలంలో అనేక ఉత్పత్తి సాధనాలు వచ్చాయి. వ్యవస్థీకృత వ్యవసాయం చేయడం ప్రారంభించిన తర్వాత భూమి ఉత్పత్తి సాధనంగా మారి డిమాండ్‌ పెరిగింది. భూచట్టాల విషయంలో వందల ఏండ్లనుంచి అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ అనేక సమస్యలున్నాయి. గిరిజనుల పోడు భూముల సమస్య, హద్దులు లేకపోవటం, దాడులుచేయడం, గెట్ల పంచాయితీ, చెట్ల పంచాయితీ, తలకాయలు పగలటం, హత్యలుచేయడం వంటివి ఎన్నో చూస్తున్నం. ఎప్పట్నుంచో భూ సంస్కరణలను ఒక పద్ధతిలో చేయాలనే ఆలోచనలు జరిగాయి. చరిత్రలో షేర్సా సూరి నుంచి మనదేశంలో భూసంస్కరణలు మొదలయ్యాయి.

భూములను కొలిచే విధానం మనదేశంలో షేర్షాతోనే ప్రారంభమైంది. అక్బర్‌ కాలంలోనూ సంస్కరణలు మొదలుపెట్టారు. బ్రిటిష్‌ కాలంలో రైత్వారీ పద్ధతిని థామస్‌ మన్రో తెచ్చారు. మరికొందరు కొన్ని పద్ధతులు ప్రవేశపెట్టారు. తెలంగాణలో మొదటి సాలార్జంగ్‌ ఎంతో కృషిచేశారు. హైదరాబాద్‌ సహా రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలుచేశారు. చాలా అద్భుతాలుచేశారు. తెలంగాణలో రైల్వేస్టేషన్లు, దవాఖానల వంటి ఎన్నో నిర్మాణాలు జరిగాయి. 1940లో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో భూపోరాటాలు జరిగాయి.

జాగీర్దార్‌ రద్దు కావచ్చు, 1950 చట్టాలు కావొచ్చు. 1971లో పీవీ నరసింహారావు భూ సంస్కరణలు చేపట్టారు. 1985లో ఎన్టీఆర్‌ పటేల్‌ పట్వారీ రద్దు, గ్రామాధికారి వ్యవస్థలో వివిధ మార్పులు చేపట్టగా, 2002లో అప్పటి చంద్రబాబు రెవెన్యూ, పంచాయతీని ఒకటిగా చేశారు. 2007లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మళ్లీ పంచాయతీ, రెవెన్యూలను వేరుచేసి వీఆర్వో వ్యవస్థను తీసుకొచ్చారు.

ఏ ప్రభుత్వమూ పరిష్కరించలేదు
ఎప్పట్నుంచో ఐటీ బాగా అభివృద్ధి చెందినప్పటికీ, దానిని రెవెన్యూతో అనుసంధానించేందుకు గత ప్రభుత్వాలు ముందుకురాలేదు. అలాచేస్తే చాలా సమస్యలు పోయేవి. అలా సులభతరం చేయకుండా సమస్యను మరింత జటిలంచేశారు. కొద్దిమంది చేతుల్లో అధికారాలు కేంద్రీకృతమై.. మాఫియాలు పుట్టుకొచ్చాయి. దురాగతాలు మొదలయ్యాయి. కోట్ల రూపాయలు చేతులు మారాయి.

అంతులేని అవినీతి జరిగింది. పేద ప్రజలైతే మహాయాతన పడ్డారు. రెవెన్యూ, రైతుల మధ్య శత్రుపూరిత వాతావరణం నెలకొన్నది. వీటన్నింటినీ కండ్లనిండా చూశాం. ఎమ్మార్వో మీద పెట్రోల్‌పోసి తగులబెట్టి, ఆయన తగులబెట్టుకొని చనిపోవటం వంటి భరించడానికి వీలులేని పరిణామాలు జరిగాయి. అసైన్డ్‌లాండ్స్‌ పేదలకు ఇస్తే దక్కకుండా గద్దలు తన్నుకుపోవటం కొనసాగాయి. గత ప్రభుత్వాలు ప్రేక్షకపాత్ర వహించినయి తప్ప శాశ్వత ప్రాతిపదికన ఇన్ని కోట్ల మంది ప్రజల భూ సమస్యల పరిష్కారంకోసం ఏమీ చేయలేదు. కొంతచేసినా ఫలితం రాలేదు.

స్వచ్ఛమైన సమాజానికి బాటలు
తెలంగాణలో భూముల విలువలు చాలా పెరిగినయి. భవిష్యత్తులో శాంతి భద్రతల సమస్యలు వచ్చే ప్రమాదమున్నది. పేదవాళ్ల భూములు లాక్కొనే ప్రమాదమున్నది. అందుకే కఠినమైనా సరే.. ఈ చట్టాన్ని తీసుకువస్తున్నం. రాష్ట్రం కష్ట పరిస్థితుల్లో ఉన్నది. కేంద్రం మొండిచెయ్యి చూపిస్తున్నది. ఇయ్యాల్సిన జీఎస్టీ కూడా ఇస్తలేదు. రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం వల్ల కొంత ఆదాయం తగ్గుతుంది. పది కోట్లు వచ్చేది.. పోతది.

అది నాకు తెలుసు. అయినా సరే.. గత మూడేండ్లుగా ఏదో ఒక పేరు మీద వాయిదా పడుతూ వస్తున్నందున పోతేపోనీ, 400-500 కోట్ల నష్టం వచ్చినా సరే అనుకొని ఈ కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నం. రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తులకు బ్రహ్మాండమైన ఊరట కలుగాలని ఇది చేస్తున్నం. రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికీ పారదర్శకమైన, అద్భుతమైన సౌకర్యం వస్తది. హరాకిరీ తగ్గుతుంది. అవినీతి మాయమవుతుంది. అధికారుల డిస్క్రిప్షన్‌ పవర్‌ పోతుంది. స్వచ్ఛమైన సమాజానికి బాటలు వేస్తుంది.

మూడేండ్ల నుంచి కసరత్తు
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేండ్లపాటు ఎంతో శ్రమించాం. కోట్ల ప్రజల జీవితాలకు సంబంధించిన విషయం కాబట్టి పకడ్బందీగా చేస్తున్నాం. భూ రికార్డుల ప్రక్షాళన మొదలుపెట్టాం. అప్పటి పరిస్థితుల్లో కొంతచేశాక ఎన్నికలు వచ్చాయి. రెండోసారి గెలిచిన తర్వాత మళ్లీ మొదలుపెట్టాం. ఇప్పటికీ అనుకున్నంత ఫలితం రాలేదు. ప్రజల బాధలు తప్పలేదు.

గడిచిన ఆరు నెలల నుంచి కరోనా క్లిష్ట పరిస్థితులు కొనసాగుతున్నాయి. అందువల్ల కూడా కొంత కుంటుపడింది. గత మూడు నెలలుగా నేను, సీఎస్‌, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, సీఎంవో ప్రముఖ అధికారులు రాత్రి, పగలు కష్టపడి మంచి, చెడు ఆలోచనచేశాం. చివరకు నిర్ణయానికి వచ్చాం.

రెవెన్యూ మంత్రిగా నేనే ఉన్నా..
నాకు కార్యభారం ఎక్కువైనా, ఇంత గొప్ప చట్టం తేవాలనే ఉద్దేశం ఉన్నది కాబట్టి రెవెన్యూ మంత్రిగా ఎవర్నీ పెట్టలేదు. నేనైతే స్వయంగా పర్యవేక్షిస్తాననే ఉద్దేశంతో చూస్తున్నాను. సీఎస్‌కు విజ్ఞప్తిచేసి ఓవర్‌లోడ్‌ అయినా ఆ శాఖ సెక్రటరీగా ఉండమన్నా. నేను, సీఎస్‌ సమగ్రంగా అవగాహన చేసుకొన్నాం. ఎన్నో చిక్కులున్నాయి..

బరువైనా మా దగ్గర పెట్టుకొని ఈ ప్రయత్నం చేశాం. శాఖలు వేరైనా ఈరోజు ప్రవేశపెట్టిన అన్ని చట్టాల ఉద్దేశాలు ఒక్కటే. బిల్లు ఈ రోజు పెట్టాము. రెండు రోజులపాటు అందరూ పూర్తిగా చదువుకున్న తర్వాత శుక్రవారం బిల్లుపై పూర్తిగా చర్చిద్దాం. అప్పుడు ఆమోదించుకుందాం.

పేదోళ్ల చేతిలో ఈ చట్టం ఓ బ్రహ్మాస్త్రం
ప్రజలందరికీ విజ్ఞప్తి. ఈ లోపల మీరు ఎవరికీ ఏ కాణ పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. అనవసరంగా డబ్బులు దండుగ చేసుకోకండి. ఎవరైనా అడిగితే కూడా తిప్పికొట్టండి. కొద్ది సమయం పడుతుంది.. ఇదే విధానం హర్యానాలో తెచ్చారు. కాకపోతే మనం చాలా లోతుల్లోకి వెళ్లి పకడ్బందీగా తీసుకొస్తున్నం. విప్లవాత్మకమైన, నవీన పద్ధతుల్లో ఐటీ ఎనేబుల్‌ పద్ధతిలో మనం ఈ విధానం తెచ్చినం.

హర్యానా వాళ్లది మనంత సమగ్రంగా లేదు. అయినా 40 రోజుల సమయం తీసుకున్నరు. ఇప్పటికే ధరణి పోర్టల్‌ తయారవుతున్నది. ట్రయల్‌ అండ్‌ ఎర్రర్‌ కావాలి. ఎమ్మార్వోలకు రిజిస్ట్రేషన్ల బాధ్యత అప్పగిస్తున్నందున వాళ్లకు కనీసంగా 3-4 రోజుల శిక్షణ కావాలి. కొత్తవాళ్లను పెంచాలి. 2-3 ఏండ్ల కిందటే కంప్యూటర్లు కొన్నం. ఇంటర్నెట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ స్థాయిని కూడా పెంచినం. ఆపరేటర్లు కూడా సిద్ధంగా ఉన్నరు. భగవంతుడి కృప వల్ల పేదలకు, నోరులేని వాళ్లకు, బక్కపలచని ప్రజలకు ఈ చట్టం ఒక బ్రహ్మాస్త్రంగా ఉండాలి. ఈ మాఫియా ముఠాలు, భూబకాసురులు, భూ దొంగలు, అవినీతి అధికారుల నుంచి ఈ చట్టం వంద శాతం పూర్తి రక్షణ కల్పిస్తది” అని అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat