తాతల నుంచి వచ్చిన భూములు పంచుడంటేనే పంచాదిలు. తిట్టుకునుడు, కొట్టుకునుడు దాకా పోతయి. కానీ, అట్లోంటి పంచాయితీలకు కొత్త రెవెన్యూ చట్టంతో సర్కారు చెక్ పెట్టింది. వంశపారంపర్య భూమిని (ఫౌతీ) పంచుకొనే హక్కును కుటుంబానికే అప్పగించింది.వారసులంతా కూర్చొని, మాట్లాడుకొని పంపకాలు పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నది.
లొల్లి.. కొట్లాటలు
వారసత్వంగా వచ్చే భూమి పంపకాల్లో గొడవలకు కొదవేలేదు. ప్రస్తుత విధానంలో వారసులు ముందుగా అడంగల్, పహాణీ, పట్టాదారు పాస్‌పుస్తకం, టైటిల్‌డీడ్ తదితర ధ్రువపత్రాలతో తాసిల్దార్‌కు దరఖాస్తు చేయాలి. వారసులుగా నిరూపించే పత్రాలను జతచేయాలి. ఆ తర్వాత కుటుంబసభ్యుల అభ్యంతరాలు కోరుతూ తాసిల్దార్ 30 రోజుల నోటీస్ పీరియడ్ ఇస్తారు. 45 రోజుల తర్వాత గ్రామస్థులు, వీఆర్వో సమక్షంలో విచారణ జరుపుతారు. కుటుంబసభ్యులందరి స్టేట్‌మెంట్లు రికార్డ్ చేసుకుంటారు. అభ్యంతరాల్లేకుంటే పంపకాలు పూర్తవుతాయి. సర్వేయర్ హద్దులు నిర్ణయిస్తారు. కొత్త పాస్‌బుక్‌లు, టైటిల్‌డీడ్ వస్తాయి. అభ్యంతరాలుంటే సివిల్‌కోర్టును ఆశ్రయించాలని సూచిస్తారు. ఈ క్రమంలో అన్నదమ్ములు ఒకరికి తెలియకుండా మరొకరు ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఘటనలు అనేకం. ఓ జాతీయ సంస్థ సర్వే ప్రకారం హత్యానేరాల్లో 12% భూములకు సంబంధించినవే.
చర్చించుకున్నాకే తాసిల్దార్ వద్దకు..
కొత్త చట్టం ప్రకారం యజమాని బతికి ఉంటే.. కుటుంబం మొత్తం కూర్చొని చర్చించుకొని, పంపకాలు జరుపుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ యజమాని మరణిస్తే మిగతా కుటుంబసభ్యులు చర్చించి ఒక ఒప్పందానికి రావాలి. తర్వాత తాసిల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాలి. దీనికి ఒప్పందపత్రాన్ని జతచేయాలి. రిజిస్ట్రేషన్ సమయంలో యజమాని, వారసులు అందరూ తాసిల్దార్ ముందు హాజరుకావాలి. వారిని విచారించి, రికార్డుల్లో మార్పులు చేస్తారు.