తెలంగాణ రాష్ట్రంలో కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దీనిపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అలాగే కరోనా చికిత్స పొందిన పేదలకు సీఎంఆర్‌ఎఫ్ కింద సాయం చేస్తామని తెలిపారు.
వాటికి సంబంధించిన బిల్లులుంటే తనకు పంపాలని కోరారు. కరోనాపై బుధవారం జరిగిన స్వల్పకాలిక చర్చ అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ పక్ష నేత భట్టి విక్రమార్క, ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ తదితరులు చేసిన సూచనల్లో కొన్ని పాటించేవి ఉన్నాయన్నారు.
బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ కంటే మన ఆరోగ్యశ్రీ ఎన్నో రెట్లు పటిష్టంగా ఉందని చెప్పారు. ఆరోగ్యశ్రీని, 108ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చారని.. ఆ పథకాలు బాగున్నందువల్లే తాము వాటి పేరును కూడా మార్చకుండా అలాగే కొనసాగిస్తున్నా మని స్పష్టంచేశారు.
రాష్ట్ర గవర్నర్‌కు కూడా ఆయుష్మాన్ భారత్‌తో కలిపి ఆరోగ్యశ్రీని నడిపిస్తామని చెప్పామన్నారు. కేంద్రం అనుమతిస్తే రెండూ కలిపి వాడతామని వెల్లడించామన్నారు