మనసు మమత, మౌనరాగం వంటి సీరియళ్లతో పాపులర్ అయిన బుల్లితెర నటి శ్రావణి (26) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నియోజకవర్గం గొట్టిప్రోలుకు చెందిన శ్రావణి 8 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి టీవీ సీరియళ్లలో నటిస్తోంది.
ఆర్థికంగా పుంజుకోవడంతో స్వగ్రామంలో ఉంటున్న తల్లిదండ్రులను, సోదరుణ్ని కూడా తనవద్దకే పిలిపించుకుంది. ఏడాది క్రితం టిక్‌టాక్‌లో ఆమెకు.. కాకినాడకు చెందిన దేవరాజ్‌రెడ్డి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. తర్వాత అతడు ఆమె ఇంట్లోనే ఉండసాగాడు.
శ్రావణి అతడికి కూడా సీరియళ్లలో అవకాశం ఇప్పించింది. ఈ క్రమంలోనే దేవరాజ్ రెడ్డి ఆమెను డబ్బుల కోసం వేధించాడని.. డబ్బులు ఇవ్వకుంటే.. ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించేవాడని శ్రావణి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దేవరాజ్‌రెడ్డి వేధింపులు భరించలేక శ్రావణి ఈ ఏడాది జూన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.
దేవరాజ్‌రెడ్డిపై పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారుగానీ.. ఆ తర్వాత మూడురోజులకే శ్రావణి కేసును వాపసు తీసుకుంది. దేవరాజ్ శ్రావణి ఇంటిని వదిలి వెళ్లిపోయి వేరుగా ఉంటున్నాడు. దేవరాజ్ రెడ్డి ఇంటి నుంచి వెళ్లిపోయినప్పటికీ శ్రావణిని కలుస్తున్నట్టు సమాచారం.