చెన్నైలో ఈనెల 7వ తేది నుంచి మెట్రో రైలు సేవలు ప్రారంభం కానున్న నేపథ్యంలో టైమ్‌టేబుల్‌ను చెన్నై మెట్రోరైల్ లిమిటెడ్ (సీఎంఆర్‌ఎల్) అధికారులు విడుదల చేశారు. దేశవ్యాప్తంగా నాలుగవ దశ లాక్‌డౌన్‌కు సడలింపులు ఇవ్వడం వల్ల ఈనెల 7వ తేదీ నుంచి మెట్రోరైలు సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
అదే సమయంలో కంటైన్మెంట్ జోన్లలో మాత్రం మెట్రో రైల్వేస్టేషన్లు మాత్రం పనిచేయవు. మాస్కులు ధరించి, భౌతికదూరం పాటిస్తూ మెట్రోరైళ్లలో ప్రయాణం చేయాలని సీఎంఆర్‌ఎల్ ఇదివరకే ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని మెట్రో రైల్వేస్టేషన్లలో మాస్కులు విక్రయించే ఏర్పాట్లు కూడా చేపట్టారు.
ఈ నేపథ్యంలో, ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు మెట్రో రైళ్లను నడుపనున్నట్టు టైంటేబుల్‌లో తెలిపారు. ఇందులో పీక్ అవర్స్ అనబడే ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు 5 నిముషాలకు ఒక మెట్రోరైలు, మిగతా సమయంలో 10 నిముషాలకు ఒక రైలును నడుపనున్నారు.
- ఈ రైళ్లు 20 సెకన్లకు బదులు 50 సెకన్ల వరకు ఆయా రైల్వేస్టేషన్‌లలో ఆగి వెళతాయి. దక్షిణ చెన్నై పరిధిలోని విమానాశ్రయం నుంచి ఉత్తర చెన్నైలోని వాషర్‌మెన్‌పేట రైలు మార్గంలో మెట్రోరైలు సేవలు ఈనెల 7వ తేదీ, సెయింట్ థామస్ మౌంట్ నుంచి సెంట్రల్ రైల్వేస్టేషన్ వరకు ఉన్న రైలు మార్గంలో ఈనెల 9వ తేదీ నుంచి రైలు సేవలు ప్రారంభమవుతాయని సీఎంఆర్‌ఎల్ తెలిపింది.